- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fake goods : నకిలీ షార్ట్ సర్క్యూట్! రాజస్థాన్ వ్యాపారుల ఇష్టారాజ్యం, మోసపోతున్న ప్రజలు
కొందరు రాజస్థాన్ వ్యాపారులు తమ షాపుల్లో నకిలీ వస్తువులు విక్రయిస్తూ నెలకు రూ.లక్షల్లో కూడగడుతున్నారు.

సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా కొందరు రాజస్థాన్ వ్యాపారులు తమ షాపుల్లో నకిలీ వస్తువులు విక్రయిస్తూ నెలకు రూ.లక్షల్లో కూడగడుతున్నారు. ఎలక్ట్రికల్ వస్తువులు, ఇంటి అవసరాలకు వినియోగించే వాటర్ పైపులు, కబోర్డ్స్‌కు వినియోగించే ఫర్నీచర్ ఇలా ఒక్కటేమిటి అన్నింటా నకిలీ వస్తువులు అమాయకులకు అంటకడుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి సత్తుపల్లిలో ఓ రాజస్థాన్ వ్యాపారి షాపులో ఎలక్ట్రికల్ వైరు కొనుగోలు చేసి ఇంటికి అమర్చిన కొద్దిరోజులకే ఇల్లంతా షార్ట్ సర్క్యూట్ కావడంతో, ఇంటి సామాగ్రి మొత్తం కాలిపోయింది. అతడు నిలదీయగా కొందరు రాజస్థాన్ వ్యాపారులు కలిసి పంచాయతీ నిర్వహించి బాధితుడికి పెనాల్టీ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలాగే ఎన్నో ఘటనలు జరుగుతున్నా బయటికి రాకుండా షాపు నిర్వాహకులు.. తమ మధ్యవర్తులుగా ఎలక్ట్రిషన్‌లను రంగంలోకి దించి, ఫిర్యాదులను జిల్లా అధికారులకు అందకుండా పంచాయతీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరుగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా కొందరు (Rajasthani traders) రాజస్థాన్ వ్యాపారులు తమ షాపుల్లో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫర్నీచర్, షాపుల్లో విచ్చలవిడిగా నకిలీ వస్తువులు విక్రయాలు జరుపుతూ నెలకు లక్షల రూపాయలు కూడగడుతున్నారు. సత్తుపల్లి ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో పాటు ఖమ్మం జిల్లాకు 80కిలోమీటర్ల దూరంలో ఉండటం తో సత్తుపల్లికి చుట్టుపక్కల నుంచి సుమారు 80గ్రామాలు ప్రజలు నిత్యం సత్తుపల్లికి వివిధ అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే సత్తుపల్లి చుట్టూ గిరిజన, కోయ, లంబాడి తండాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సత్తుపల్లి లోని కొందరు రాజస్థాన్ షాపుల నిర్వాహకులు నకిలీ ఎలక్ట్రానిక్, ఇంటి అవసరాలకు వినియోగించే వాటర్ పైప్స్, కబోర్డ్స్‌కు వినియోగించే ఫర్నీచర్, సీలింగ్, వస్తువులను అమాయకులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్, ఇతర కంపెనీ వస్తువులకు నకిలీ వస్తువులకు మధ్య తేడాలు సివిల్ ఇంజనీర్, సీనియర్ ఎలక్ట్రికల్స్ మాత్రమే గుర్తిస్తారు. ఏమాత్రం పరిజ్ఞానం లేనివారిని ఆసరాగా చేసుకొని కంపెనీ వస్తువులు అంటూ నకిలీ వస్తువులు విక్రయిస్తున్నారు.
ఇటీవలే ఓ వ్యాపారికి పెనాల్టీ
సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి అవసరాల నిమిత్తం పట్టణంలోని ఓ రాజస్థాన్ షాప్ నిర్వాహకుడికి దగ్గరికి వెళ్లి గోల్డ్ మెడల్ వైర్ కావాలని కోరాడు. సదరు షాప్ నిర్వాహకుడు నకిలీ గోల్డ్ మెడల్ వైర్ విక్రయించాడు. ఆ ఇంటి యజమాని ఇంట్లో రెండు నెలలకే షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో ఉన్న వైరింగ్, వస్తువులన్నీ కాలిపోయాయి. దీనిపై స్థానిక ఎలక్ట్రిషన్‌ను నిలదీయడంతో ఇంటి నిర్మాణంలో వాడిన వైర్లు నకిలీ అని గుర్తించి, సదరు రాజస్థాన్ షాప్ నిర్వాహకుడి వద్దకు వెళ్లి ప్రశ్నించారు. షాప్ నిర్వాహకుడు దురుసుగా సమాధానం ఇవ్వడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేందుకు సిద్ధపడుతుండగా సత్తుపల్లిలో రాజస్థాన్ షాపు నిర్వాహకులు అందరూ ఒక్కటై స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇరువర్గాల వారిని సముదాయించి పంచాయితీ నిర్వహించి, నకిలీ వస్తువులు విక్రయించినందుకు రూ.55 వేలు పెనాల్టీ విధించడంతో సద్దుమణిగింది. ఈ ఘటనతో రాజస్థాన్ షాపుల గోదాములో ఉన్న నకిలీ వస్తువులను బయటకు రాకుండా వేర్వేరు గోదాముల్లో భద్రపరిచినట్లు తెలుస్తున్నది.
జాడలేని అధికారులు..
సత్తుపల్లిలో రాజస్థాన్ వ్యాపారులకు చెందిన ఎలక్ట్రికల్ షాపుల్లో విచ్చలవిడిగా నకలీ వస్తువులు విక్రయిస్తున్నా జిల్లా సేల్స్ టాక్స్, ఎలక్ట్రికల్, పైపుల, ఫర్నీచర్ కంపెనీల అధికారులు గత ఐదేళ్లుగా పర్యవేక్షించడం లేదని తెలుస్తున్నది. జిల్లా అధికారులకు రాజస్థాన్ షాపుల నిర్వాహకుల నుంచి భారీ ఎత్తున ముడుపులు ముడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సత్తుపల్లిలో నకిలీ ఎలక్ట్రికల్ వస్తువులు యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేసినా షాపు నిర్వాహకులు.. తమ మధ్యవర్తులుగా ఎలక్ట్రిషన్‌లను రంగంలోకి దించి, ఫిర్యాదులు జిల్లా అధికారులకు అందకుండా పంచాయితీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా జిల్లా సేల్స్ టాక్స్ ఉన్నతాధికారులు, వివిధ కంపెనీల అధికారులు స్థానిక పోలీసులు స్పందించి, సత్తుపల్లిలో రాజస్థాన్ వ్యాపారులు నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ షాపులపై కొరడా ఝుళిపించాలని, నకిలీ వస్తువుల విక్రయాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
90 శాతం నకిలీ వస్తువులే విక్రయాలు: నల్లగట్ల మోహన్, సత్తుపల్లి
సత్తుపల్లి రాజస్థాన్ ఎలక్ట్రికల్ షాపుల్లో దాదాపు 90 శాతం మేర నకిలీ వస్తువులే విక్రయిస్తున్నారు. ఎలక్ట్రికల్ షాపుల్లో అమ్మే వస్తువులకు నిర్దిష్టమైన ప్యాకింగ్, ఎమ్మార్పీ, కంపెనీ పేరు, లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదో ఒక రకం కంపెనీ పేరుతో ఉన్న వస్తువులను కస్టమర్లకు అమ్ముతున్నారు. బిల్లులు అడిగితే వైట్ పేపర్‌పై ఇస్తున్నారు. సత్తుపల్లి పట్టణంలో ఉన్న రాజస్థాన్ ఎలక్ట్రికల్ షాపులు గోదాములపై విజిలెన్స్, సేల్స్‌టాక్స్, స్థానిక పోలీసులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి నకిలీ వస్తువుల విక్రయానికి కళ్లెం వేయాలి.






