- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి దూకుడు.. అడకత్తెరలో అధికార పార్టీ!
తెలంగాణ కాంగ్రెస్‌లో నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి చేస్తున్న విమర్శలు పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతలే విపక్షంగా మారారనే చర్చ జరుగుతున్నది. చట్టసభల ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు అధికార పక్షాన్నే ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించడం, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థించడం చేస్తారు. అలా చేయడం ఇష్టంలేకపోతే మౌనంగా ఉంటారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలు, పార్టీ పెద్దలు, ఢిల్లీ ఏఐసీసీ నేతల వద్ద చెప్పుకోవాల్సి ఉండగా.. దీనికి విరుద్ధంగా బహిరంగ వేదికలపై ప్రభుత్వం, సీఎం, మంత్రులు, స్కీమ్స్‌పై చేస్తున్న విమర్శలు, ఆరోపణలు.. విపక్షాలకు అస్త్రాలను ఇచ్చినట్లు అవుతున్నది. ఇదే అదనుగా విపక్షాలు సైతం.. ‘మీ పార్టీ ప్రతినిధులే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ, పథకాల తీరు అలా ఉంది’ అని ఎద్దేవా చేస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మొదట సమాధానం చెప్పండి అంటూ విపక్ష నేతలు సవాళ్లు విసురుతున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇరకాటంలో పడే పరిస్థితి వస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లనే ఉంటది. ఐక్యత ఉండదు’ అనే తరహాలో వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పేలా ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతుండటంపై సొంత పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిధులు, పథకాలపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. తరచుగా పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొంత కాలంగా విమర్శలను తగ్గించినా ఆయన.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తనదైన శైలిలో స్పందించారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆయుధంగా మారింది. నిధులు, ప్రభుత్వ పథకాలు, మంత్రులపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. ఒకే జిల్లాకు నిధులు వెళ్తున్నాయంటూ ఆరోపించారు. సొంత జిల్లా మంత్రి ఉత్తమ్‌పైనా విమర్శలు చేశారు. కాగా, ఆయనకు మంత్రి పదవి ఇచ్చేవరకు ఈ విమర్శలు ఇలాగే కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దిగితే కానీ, దీనికి పరిష్కారం దొరకదని చెబుతున్నారు.
మండలిలో విజయశాంతి..
తనను పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని, సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ విజయశాంతి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయకపోవడంపై కూడా ఆవేదనతో ఉన్నట్లు తెలిసింది. ఆమె తన అసంతృప్తిని శాసనమండలిలో వ్యక్తం చేసినట్లు కనిపించింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షం కూడా చేయని రీతిలో ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ శాసనమండలిలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కోదండరాం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఆయన నేతృత్వంలో కమిటీ వేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆమె కమిటీలు వద్దంటూ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీని ఇరకాటంలోకి నెట్టాయనే చర్చ జరుగుతున్నది.
వివాదాస్పదంగా అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ప్రసంగాలు, చిట్‌చాట్‌లు వివాదస్పదమవుతున్నాయి. పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఒక్కోసారి పక్క రాష్ట్రాల సమస్యలు, అక్కడి నాయకులపైనా ఆయన స్పందించిన తీరును చూస్తుంటే.. లేని సమస్యలను పార్టీ, ప్రభుత్వానికి తీసుకువస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే.. కొత్త విషయాలను తెలుసుకోవాలనే దానికంటే వార్తల్లో ఉండాలనే ఆలోచనే ఎక్కువగా కనబడుతున్నదని సొంత పార్టీ నేతలే ఆయన్ను విమర్శిస్తున్నారు. ప్రతి అంశంపైనా ఏదో కోణంలో మాట్లాడటం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం అన్నట్లుగా చేస్తున్నారని,, తన ఉద్దేశం అది కాదు ఇది అంటూ ఆయన వివరణ ఇచ్చుకునే సమయానికి పార్టీకి, ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగిపోతున్నదని విశ్లేషిస్తున్నారు. వీరికి ఎలాంటి హెచ్చరికలు చేయకుంటే.. మరికొందరు ఇదే బాటలో వెళ్లే అవకాశం ఉందని, దీంతో పార్టీకి మరింత ఇబ్బందకరమైన పరిస్థితులు వస్తాయని పార్టీనేతలు చెబుతున్నారు.






