TG: మండుటెండలో పలకరించిన వరుణుడు: పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన

by Gantepaka Srikanth |

ఎండవేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు.

TG: మండుటెండలో పలకరించిన వరుణుడు: పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎండవేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. ఆదివారం సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకస్మికంగా వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడగా, మరికొన్ని చోట్ల వడగండ్లు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఎల్బీనగర్‌తో పాటు మీర్‌పేట్‌, కర్మాన్‌ఘాట్‌ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మూసాపేట్, బాలానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వర్షంతో పాటు వడగండ్లు (Hailstones) పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నాపెద్దా తేడా లేకుండా వడగండ్లను ఏరుకుంటూ జనం సందడి చేశారు.

ట్రాఫిక్ జామ్.. ఉపశమనం..

అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కూకట్‌పల్లి, ఎల్బీనగర్ ప్రధాన రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరచడంతో ఎంతో ఊరటనిచ్చింది. రానున్న కొద్ది గంటల్లో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.

Next Story