తెలంగాణలో రూ.42,219 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

ప్రస్తుతం తెలంగాణలో రూ.42,219 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో రూ.42,219 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం తెలంగాణలో రూ.42,219 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం 2014-15లో రూ.258 కోట్లు కాగా, 2025-26 నాటికి రూ.5,337 కోట్లకు పెరిగాయని ఆయన వెల్లడించారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రసంగించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. మొత్తం రూ.715 కోట్లు ఖర్చుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించుకుంటున్నామని... ఇప్పటి వరకు 50శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని రకాలా సౌకర్యాలు ఉండేలా డిజైన్ చేసినట్లు వెల్లడించారు.

నిత్యం 1.97 లక్షల మంది, గంటకు 22 వేల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వస్తున్నారని... వారికి ఇబ్బందులు లేకుండానే నిర్మాణం వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది దశల వారీగా ఈ నిర్మాణం అందుబాటులోకి రానుందన్నారు. నాలుగు నెలల్లో సౌత్ బ్లాక్, డిసెంబర్ నాటికి మొత్తం రైల్వే స్టేషన్ పూర్తి కానుందన్నారు. 3 వేల మంది ప్రయాణికులు కూర్చునేలా 3 ఎకరాల్లో వెయిటింగ్ హాల్, క్యాంటిన్ వంటి సదుపాయాలు నిర్మిస్తున్నామన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు తరహాలో స్టేషన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు.

ఈ స్టేషన్‌కు నేరుగా మెట్రో అనుసంధానం చేపడుతున్నాన్నారు. బస్ స్టేషన్ కు కూడా నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు సబ్ స్టేషన్లు, అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ సిస్టమ్ స్టేషన్ లో ఉంటాయి. రోజుకు 5 లక్షల లీటర్ల మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తయితే ప్రతి రోజు 2.7 లక్షల మంది, గంటకు 32 వేల మంది ప్రయాణికులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు. 1.65 లక్షల చ.మీ విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతోందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా స్టేషన్ ను ప్రారంభించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. డిసెంబర్ 25 నాటికి మల్టి లెవల్ పార్కింగ్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.719 కోట్లు కాగా, ఇప్పటివరకు 50 శాతం పనులు పూర్తయ్యాయి. సౌత్ బేస్ మెంట్, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, కాజీపేట వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి అయ్యాయి. సౌత్ మెయిన్ బిల్డింగ్, నార్త్ మెయిన్ బిల్డింగ్, కవర్ ఓవర్ ప్లాట్ ఫారం, హైదరాబాద్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి తదితర పనులు నిర్మాణంలో ఉన్నాయి

మోదీ హయాంలో రాష్ట్రానికి 21 రెట్లు పెరిగిన రైల్వే బడ్జెట్...

ప్రధాని మోదీ హయాంలో తెలంగాణకు రైల్వే కేటాయింపులు దాదాపు 21 రెట్లు పెరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. 2014-15 నుంచి 2025-26 వరకు 11 ఏళ్లలో తెలంగాణకు జరిగిన రైల్వే బడ్జెట్ కేటాయింపుల మొత్తం రూ. 30,832 కోట్లు అని వెల్లడించారు. 2004-14 మధ్య పదేళ్లలో తెలంగాణలో 136 కి.మీ.ల కొత్త లైన్ల నిర్మాణం జరిగితే... 2014-25 మధ్య 11 ఏళ్లలో 346 కి.మీ.ల కొత్తలైన్ల నిర్మాణం జరిగిందన్నారు. రూ.294 కోట్లతో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సికింద్రాబాద్ లో ప్రారంభించుకున్నామని తెలిపారు.

రూ.908.15 కోట్లతో మహబూబాబాద్ పరిసర ప్రాంతంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి-నిజామాబాద్, జగ్గయ్యపేట-విష్ణుపురం, భద్రాచలం-సత్తుపల్లి, దేవరకద్ర-కృష్ణా, అక్కన్నపేట-మెదక్ వంటి కొత్త ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. సిద్దిపేట-కొత్తపల్లి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 2004-14 మధ్య యూపీఏ హయాంలో తెలంగాణలో ఒక్క డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం కూడా జరగలేదని ఎద్దేవా చేశారు.

2014-25 మధ్య 11 ఏళ్లలో 487 కి.మీ.ల డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఇందులో సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్, రాఘవపురం-మందమర్రి ట్రిప్లింగ్, ఎంఎంటీఎస్ ఫేజ్- 2, కాజీపేట్ బైపాస్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. కాజీపేట్-బల్లార్ష ట్రిప్లింగ్, కాజీపేట్-విజయవాడ ట్రిప్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో రైల్వే లైన్లకు 100శాతం విద్యుదీకరణ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

సికింద్రాబాద్ లో వందేభారత్ మెయింటనెన్స్ డిపో...

రూ.439 కోట్లతో వందేభారత్ కోచ్ ల మెయింటెనెన్స్ కోసం సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ప్రత్యేక డిపో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. సికింద్రాబాద్‌లో 2 పిట్ లైన్లు, కాచిగూడలో 1 పిట్ లైన్ ఏర్పాటు చేసి వందేభారత్ మెయింటెనెన్స్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రూ.521.36 కోట్లతో కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌ను ప్రధాని చేతుల మీదుగా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రారంభించుకోనున్నామన్నారు. రూ.412.26 కోట్లతో ఘట్ కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పొడిగింపు పనులను రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా పూర్తి చేస్తామన్నారు.

రానున్న మూడేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలన్న సంకల్పం పెట్టుకున్నట్లు తెలిపారు. రూ.3591 కోట్లతో 173 కి.మీ.ల పొడవున చేపట్టనున్న పాండురంగాపురం-భద్రాచలం-మల్కాన్‌గిరి కొత్త రైల్వే ప్రాజెక్టు పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు రోడ్డు విస్తరణ పనులు చేయాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోవట్లేదన్నారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ కు సైతం రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేస్తే రైల్వే శాఖ నుంచి కూడా కావాల్సిన మద్దతు కూడా అందుతుందన్నారు.

Next Story