పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో రగడ.. కేటీఆర్ పై స్పీకర్, పొంగులేటి సీరియస్

by Prasad Jukanti |   (  Updated:2026-03-17 09:43:17  IST  )

తెలంగాణ అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపుల అంశంపై దుమారం రేగింది. కేటీఆర్, స్పీకర్, పొంగులేటి మధ్య హాట్ డిస్కషన్ నడిచింది.

పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో రగడ.. కేటీఆర్ పై స్పీకర్, పొంగులేటి సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీ వేడీగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల తీర్పు అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ ఘాటుగా స్పందించారు. తీర్పు కాపీ చదివి వచ్చి మాట్లాడాలని సూచించగా, కేటీఆర్‍కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీందో పార్టీ ఫిరాయింపుల అంశం సభలో హాట్ హాట్‍గా మారింది.

మీరంటే గౌరం ఉంది కానీ..

చర్చ సందర్భంగా సభలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని అంశాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ.. స్పీకర్‍ను ఉద్దేశించి మీరంటే నాకు మర్యాద ఉంది. కానీ తమరు కూడా మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే మీరు ఓ నిర్ణయం తీసుకున్నారు. మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది. మీరు నేను మిత్రులం అది అందరికీ తెలుసు. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైతే తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు సభ్యుడిగా నాకు ఇక్కడ ఉంది. ఉంటుందన్నారు. మీ జ్యుడిషియల్ అథారిటీని మేము కాదనడం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం మా బాధ్యత. హైకోర్టులో కాకుంటే సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు తీర్పుపై అవసరమైతే రివ్యూ పిటిషన్లు వేస్తామని ఇది న్యాయవ్యవస్థలో ప్రాసెస్ అన్నారు. దేశంలో ఆయారాం గయారామ్ సంస్కృతిని తీసుకువచ్చింది కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అధికారం వచ్చిందని అహంకారంతో మాట్లాడవద్దని నేనేమి ఇక్కడికి ఊరికేనే రాలేదని నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వచ్చామన్నారు.

కాస్త తగ్గించుకో..

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. జ్యుడిషియరీ వ్యవస్థలో జడ్జి తీర్పు ఇస్తారు. కానీ మీరు జడ్జిమెంట్ చదవకుండానే నాపై ఎన్ని అభియోగాలు మోపారు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా జడ్జిమెంట్ చదివాక మాట్లాడితే మీకు నేను జవాబిస్తా. దయచేసి విషయంలో ప్రశ్నించడాన్ని తగ్గించుకుంటే మంచిదని సూచించారు.

నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు:

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి కట్టుకథలు అల్లుతున్న ప్రతిపక్ష నేత చివరకు జడ్జి స్థానంలో స్పీకర్ ను కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతుంటే వారు ఏ రకమైన అహంకారంతో ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు. వీరి అహంకారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని అందుకే పదే పదే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నాలుగు సార్లు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. మీరు చెప్పినవే నిజాలైతే నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అంతకు ముందు పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకపోతే వాటికి కారణాలపై విశ్లేషించుకోకుండా కట్టుకథలు, మాటల గారడీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నిరంకుశం అని మాట్లాడుతున్నారని నిరంకుశానికి బ్రాండ్ అంబాసీడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? అని అని మండిపడ్డారు. పార్టీల ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా అని అన్నారు.

Next Story