- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది చట్టబద్ధమైన దోపిడే.. టోల్ చార్జీలపై రాజ్యసభలో ఎంపీ నిలదీత
టోల్ చార్జీల దోపిడీపై ఇవాళ రాజ్యసభలో ప్రస్తావణకు వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని జాతీయ రహదారులపై టోల్ చార్జీల వసూళ్లు వ్యవస్థీకృత దోపిడీగా మారిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. నిర్వహణ లోపం, అధిక చార్జీలతో ప్రయాణికులపై భరించలేని భారాన్ని మోపుతున్నారని దేశంలో టోల్ చెల్లింపులు ఒక రకమైన వేధింపులుగా మారాయని ఆరోపించారు. ఇవాళ రాజ్యసభలో జీరో అవర్‍లో ఆయన టోల్ చార్జీల అంశాన్ని ప్రస్తావించారు. దేశ ప్రజలపై టోల్ పెద్ద భారంగా మారిందని టోల్ ప్లాజాల వద్ద రద్దీ, దుర్వినియోగం, అధిక లాభాపేక్ష వల్ల రోడ్డు వినియోగదారులకు తమ ప్రయాణ అనుభవం అసౌకర్యం మాత్రమే కాదు అన్యాయంగా మారుతోందన్నారు.
ఇప్పటికే పన్ను చెల్లించిన ఆదాయంతో కొనుగోలు చేసిన వాహనాలపై రోడ్డు ట్యాక్స్, మౌలిక సదుపాయాల సెస్సుతో పాటు జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇక ఇంధన కొనుగోళ్లకు ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక ఎక్సైజ్ సుంకం, వ్యాట్, రోడ్డు అభివృద్ధికి సెస్, మౌళిక సదుపాయలకు సెస్ పేరుతో రకరకాలుగా వసూలు చేస్తున్నారు. వీటన్నింటికి అదనంగా హైవేలపై టోల్ కూడా చెల్లించాల్సి వస్తోందని ఇది దేశంలోని పౌరులకు భరించలేనివాగా మారుతున్నాయన్నారు. టోల్ చార్జీలు వసూలు చేస్తున్నా అనేక ప్రాంతాల్లో రోడ్ల నాణ్యత ఏమాత్రం బాగోలేవని భద్రతా మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల ప్రతియేడాది వేలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారని చెప్పారు. అనేక చోట్ల రోడ్డు నిర్మాణానికి అయిన పూర్తి ఖర్చును తిరిగి పొందిన తర్వాత కూడా టోల్ వసూలు కొనసాగుతోందని ఇది చట్టబద్ధమైన దోపిడీ దీనిని ఆపాలన్నారు. టోల్ ప్లాజాల వద్ద ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యం జరిగితే వాహనాలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.






