ప్రజా రక్షణే సీఆర్పీఎఫ్ ప్రథమ కర్తవ్యం కావాలి

by Elthuri vijay kumar |

సీఆర్పీఎఫ్ జవాన్లు ముందు ప్రజలను కాపాడాలని, ఆ తర్వాత ప్రభుత్వ స్థలాలను కాపాడాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు.

ప్రజా రక్షణే సీఆర్పీఎఫ్ ప్రథమ కర్తవ్యం కావాలి
X

ప్రజా రక్షణే సీఆర్పీఎఫ్ ప్రథమ కర్తవ్యం కావాలి

-ఆ తర్వాతనే భూముల పరిరక్షణ

-నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్

-మియాపూర్ నడిగడ్డ తండాలో పర్యటన

దిశ, శేరిలింగంపల్లి : సీఆర్పీఎఫ్ జవాన్లు ముందు ప్రజలను కాపాడాలని, ఆ తర్వాత ప్రభుత్వ స్థలాలను కాపాడాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ ఇతర అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ నడిగడ్డ తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా బంజారాలు, ఇతరులు ఇక్కడ గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని, కానీ స్థలాల పరిరక్షణ పేరిట సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారంటూ తమ కమిషన్ దృష్టికి అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే ఇక్కడ పర్యటిస్తున్నామన్నారు. సీఆర్పీఎఫ్ తమ పరిధిలో పనిచేస్తే తాము స్వాగతిస్తామని, కానీ ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరిట బంజారాలను, ఇతరులను ఇబ్బందులు పెడతామంటే కుదరదని, ఇళ్లల్లోకి వెళ్తామంటే సహించేది లేదన్నారు. గతంలో ఏం జరిగినా ఎవరికి తెలిసేది కాదని, కానీ కేంద్ర ప్రభుత్వ చొరవతో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్టివ్ గా పనిచేస్తుందని జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. సీఆర్పీఎఫ్ ముందు ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతనే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని మరోసారి సూచించారు. ప్రజలు కూడా ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురిచేస్తాం, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడులు చేస్తామంటే సరికాదని హితవు పలికారు. ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అందరికి మంచి జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని అన్నారు. అనంతరం పీఏసీ చైర్మెన్, ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రజలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, ఎలాంటి సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ప్రజలను సీఆర్పీఎఫ్ అధికారులు ఇబ్బంది పెట్టద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story