చిచ్చురేపిన ప్రోటోకాల్ రగడ.. ఫిరోజ్‌ఖాన్‌‌‌పై చేయిచేసుకున్న ఉస్మాన్‌ హజారీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-27 11:53:20  IST  )

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.

చిచ్చురేపిన ప్రోటోకాల్ రగడ.. ఫిరోజ్‌ఖాన్‌‌‌పై చేయిచేసుకున్న ఉస్మాన్‌ హజారీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ (Gandhi Bhavan)లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నేతలు పరస్పరం ఘర్షణకు దిగడంతో వాతావరణం ఒక్కసారిగా రసాభాసగా మారింది. మంత్రులు, సీనియర్ నేతల సమక్షంలోనే నేతలు భౌతిక దాడులకు దిగడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ప్రోటోకాల్ రగడ.. చొక్కాలు పట్టుకున్న నేతలు

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పార్టీ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు గాంధీభవన్‌లో ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రోటోకాల్ (Protocol) విషయంలో వివాదం మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్ (Feroz Khan), ఉస్మాన్ హజారీ (Usman Hazari) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆగ్రహంతో ఊగిపోతూ, మంత్రుల ముందే చొక్కాలు పట్టుకుని గొడవకు దిగారు. అనంతరం ఉస్మాన్ హాజారీ, ఫిరోజ్‌ఖాన్‌‌ను చెంపదెబ్బ కొట్టడంతో కింద పడిపోయారు. అయితే, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం. మంత్రులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఇరువర్గాల నేతలు శాంతించ లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన వారు సమావేశాన్ని మధ్యలోనే అర్థాంతరంగా ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story