BJP: ఈటలకు పదవి రానందుకు నిరసన.. కవితతో బీజేపీ నేతల చర్చలు

by Prasad Jukanti |

స్టేట్ ప్రెసిడెంట్ గా రామచందర్ రావు ఎంపిక తెలంగాణ బీజేపీలో కాక రేపుతోంది.

BJP: ఈటలకు పదవి రానందుకు నిరసన.. కవితతో బీజేపీ నేతల చర్చలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్టేట్ ప్రెసిడెంట్ గా రామచందర్ రావు ఎంపిక తెలంగాణ బీజేపీలో (Telangana BJP) చిచ్చురేపుతోంది. రామచందర్ రావు నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పగా మిగతా అసంతృప్తి నేతలు సైతం అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడంపై నిరసనగా పలువురు బీజేపీ కీలక నేతలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మేడ్చల్ బీజేపీలో కీలక నేత రామిడి వెంకట్ రెడ్డి తాజాగా కవితతో భేటీ అయ్యారు.

బీజేపీకి రామిడి వెంకట రెడ్డి గుడ్ బై!:

అల్వాల్ కు చెందిన బీజేపీ నేత రామిడి వెంకట్ రెడ్డి తాజాగా కవితతో (Kavitha) భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నది. ఈటల రాజేందర్ కు (Eatala Rajender) రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన వారిలో రామిడి వెంకట్ రెడ్డి ఒకరు. ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని అనేక సందర్భాల్లో రామిడి వెంకట్ రెడ్డి చెపుతూ వస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఈటలను కాదని మరొకరికి ఇచ్చారని అసంతృప్తితో ఉన్న రామిడి వెంకట్ రెడ్డి తాజాగా బీజేపీకి రాజీనామా చేసి జాగృతిలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు గత రెండు రోజులుగా జాగృతి (Telangana Jagruthi) నాయకురాలు కవితతో ఆయన చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. రామిడి వెంకట్ రెడ్డి వెంట మరికొంత మంది నేతలు సైతం కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

స్టేట్ పాలిటిక్స్ లో కొత్త సమీకరణాలు!:

గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాలు బీసీ నినాదం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన నేతనే తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారనే టాక్ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా బీసీ నేతలైన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పేర్లు స్టేట్ చీఫ్ రేస్ లో ప్రధానంగా వినిపించాయి. ఓ వైపు రాష్ట్ర రాజకీయమంతా బీసీ నినాదం చుట్టూ తిరుగుతుంటే పార్టీ అధిష్టానం మాత్రం అగ్రవర్గానికి చెందిన రామచందర్ రావు (Ramachandra Rao) పేరును ఖరారు చేసింది. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి అనూహ్యంగా కవితతో భేటీ కావడం ఆయన వెంట మరికొంత మంది నేతలు వెళ్తారనే ప్రచారం జరుగుతుండటంతో కవిత టీమ్ లో ఎవరెవరు చేరబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు జాగృతి బలోపేతంపై కవిత దృష్టి సారించారు. జిల్లాల్లో పర్యటిస్తూ కొత్త వారిని చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరికొంత మంది బడా నేతలు జతకలిస్తే రాష్ట్ర రాజకీయ చరిత్రలో కొత్త సమీకరణానికి తెర లేచినట్లేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీసీ నినాదం ఎజెండాతో కవిత ముందుకు వెళ్తున్న కవితతో ఎవరెవరు టచ్ లో ఉన్నారు? అనేది ఆసక్తిగా మారింది.

Next Story