- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం (Telangana Job Calendar) ఉద్యోగ క్యాలెండర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడేదీ, పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ స్పష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూల్‌ను ఆగస్టు 2న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గ్రూప్-1, 2, 3 సర్వీసులతో పాటు పోలీసు, సింగరేణి, గురుకుల, వైద్య విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ, పోలీస్ తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. అయితే సర్కార్ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి నేటితో ఏడాది పూర్తి కావొస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏడాది అవుతున్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగులు (Unemployed) మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు ఇవాళ (శనివారం) హైదరాబాద్‌లోని (Ashok Nagar) అశోక్ నగర్‌లో కొంత మంది నిరుద్యోగులు తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్‌కు ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కుర్చీలో తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ ప్లకార్డు పెట్టి దానికి దండ వేసి కొబ్బరికాయ కొట్టి, కుంకుమ బొట్లు, అరటి పండు, అగరుబత్తులు పెట్టి మరి వర్ధంతి పూజలు చేశారు. ‘జాబ్ క్యాలెండర్-2024, ప్రథమ వర్ధంతి, జననం :02-08-2024, మరణం :02-08-2024, తెలంగాణ నిరుద్యోగుల ఆశల పల్లకివై జన్మించిన నీవు, ఎస్సీ వర్గీకరణ అనే ప్రమాదానికి గురి అయ్యి అర్ధంతరంగా తనువు చాలించావు. శోకతప్త హృదయాలతో తెలంగాణ నిరుద్యోగులు’ అంటూ నిరుద్యోగులు వినూత్న నిరసన తెలిపారు.
ఏడాది క్రితం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశ పెట్టిన ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాలేదని ఈ సందర్భంగా ఓ నిరుద్యోగి మీడియాతో మాట్లాడారు. అందుకే జాబ్ క్యాలెండర్‌కు ప్రథమ వర్ధంతి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.






