ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు.. JNAFAU ఇంచార్జ్‌ వైస్ ఛాన్స్‌లర్‌పై ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-24 01:39:02  IST  )

యువతకు సృజనాత్మక నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) గత కొద్ది రోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.

ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు.. JNAFAU ఇంచార్జ్‌ వైస్ ఛాన్స్‌లర్‌పై ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువతకు సృజనాత్మక నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) గత కొద్ది రోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. వర్శిటీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ పూర్వ విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ రంగాలలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కృషి చేస్తున్న తరుణంలో జేఎన్ఏఎఫ్ఏయూపై ఆరోపణలు రావడం విస్మయానికి గురి చేస్తోంది.

నకిలీ పత్రాలతో పదోన్నతులు

యూనివర్శిటీలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శికి, సాంకేతిక విద్యా కమిషన్, తెలంగాణ ఉన్నత విద్యామండలికి జేఎన్ఏఎఫ్ఏయూ పూర్వ విద్యార్థులు లేఖలు రాశారు. యూనివర్సిటీ ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అక్రమ పద్ధతుల్లో పదోన్నతులను కల్పిస్తున్నారని, ఇది ఆర్థికపరమైన నష్టాలకు దారితీస్తున్నదని వారు ఆరోపించారు. నకిలీ పత్రాలతో పదోన్నతులు కల్పిస్తున్నారని, అర్హత లేని వారికి కూడా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్(సీఏఎస్) కింద లబ్ధి చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఒక పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేంత వరకు ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం

యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) నిబంధనలకు విరుద్ధంగా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ను అమలు చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నదని జేఎన్ఏఎఫ్ఏయూ పూర్వ విద్యార్థులు ఆరోపించారు. యూజీసీ నిబంధనల ప్రకారం, యూజీ డిగ్రీకి, పీజీ డిగ్రీకి మధ్య కనీసం రెండేళ్ల వ్యవధి ఉండాలి. కానీ, ప్రస్తుతం సీఏఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక సంవత్సరం వ్యవధి ఉన్నవారు కూడా ఉన్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పూర్వ విద్యార్థులు అంటున్నారు. పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలను ఆశించి ఇన్ చార్జ్ వైస్ ఛాన్సలర్ ఈ సీఏఎస్ ప్రక్రియను నిర్వహిస్తున్నారని పూర్వ విద్యార్థుల సంఘం ఆరోపించింది.

Next Story