- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్‌గా ప్రమోషన్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 38 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్‌గా ప్రమోషన్లు ఇస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి క్రుష్ణ ఆదిత్య సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 12న నిర్వహించిన డిపార్టమెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశంలో ఆమోదించిన జాబితా ఆధారంగా అర్హులైన జూనియర్ లెక్చరర్లను ఎంపిక చేశారు. పలువురు జూనియర్ లెక్చరర్లకు (జేఎల్) పదోన్నతులు కల్పిస్తూ, వారికి నూతన పోస్టింగ్లను కేటాయించారు. వీరికి సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ప్రమోషన్ కమిటీ ఆమోదించిన పేర్ల ఆధారంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉత్తర్వులు అందుకున్న 15 రోజుల్లోపు కేటాయించిన కళాశాలల్లో విధుల్లో చేరాలని, లేనిపక్షంలో పదోన్నతిని కోల్పోతారని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వులు సీనియారిటీ క్లెయిమ్‌లు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పులకు లోబడి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పదిమంది నాట్ విల్లింగ్...
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్, అసిఫాబాద్, గద్వాల జిల్లాలలోని పలు ప్రాంతాలకు వెళ్ళడానికి అభ్యర్థులు సుముఖంగా ఉండడం లేదు. గతేడాది జులైలో ఇంటర్ బోర్డు 81 మంది జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 48 మంది పదోన్నతులు పొందాల్సి ఉండగా, 10 మంది ఆయా స్థానాలకు వెళ్లడంపై సుముఖంగా లేనికారణంగా 38 మాత్రమే ప్రిన్సిపాళ్లుగా ప్రమోట్ అయ్యారు.






