TG: నెరవేరిన మూడు దశాబ్దాల కల.. ఉత్తర్వులు జారీ

by Gantepaka Srikanth |

రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఈఈలకు ఎస్ఈలుగా ప్రమోషన్స్ కల్పిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

TG: నెరవేరిన మూడు దశాబ్దాల కల.. ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఈఈలకు ఎస్ఈలుగా ప్రమోషన్స్ కల్పిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు తాత్కాలిక ప్రాతిపదికన సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక పద్ధతిలో అడ్‌హక్ ప్రాతిపదికన ఈ పదోన్నతులు ఇవ్వగా.. కోర్టు కేసుల తుది తీర్పునకు లోబడి ప్రమోషన్స్ ఉంటాయని వెల్లడించారు. పదోన్నతి పొందిన అధికారులు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా కొత్త పోస్టులో చేరాల్సి ఉంది. ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 46 మంది ఎస్‌ఈలుగా పదోన్నతి పొందారు.

ఏఈఈలకు డీఈఈలుగా..

నీటి పారుదల శాఖలో 123 మందికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ)గా తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 123 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా ప్రమోషన్ పొందారు. ఈ పదోన్నతులు సైతం పూర్తిగా తాత్కాలికమైనవని.. అడ్‌హక్ ప్రాతిపదికన మాత్రమే ఇవ్వబడ్డాయని పేర్కొన్నారు. కోర్టు కేసుల తుది తీర్పులకు, సీనియారిటీ జాబితా ఖరారుకు ఇవి లోబడి ఉంటాయని తెలిపారు.

మూడు దశాబ్దాల తర్వాత పదోన్నతులు

నీటిపారుదల శాఖలో గత మూడు దశాబ్దాలుగా ప్రమోషన్స్ లేకుండా పోయాయి. దాంతో అప్పటి నుంచి చాలా మంది అధికారులు ప్రమోషన్స్ కోసం చూస్తూనే ఉన్నారు. మరికొంత మంది ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తూనే చివరకు ఉద్యోగ విరమణ సైతం పొందారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ వీరి ప్రమోషన్స్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు యూనియన్లు, ఎంప్లాయిస్ విజ్ఞప్తి చేసినా పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు వీరికి తీపికబురు అందించింది. ఒక్కో స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పిస్తున్నది. శుక్రవారం ఒక్క రోజే 46 మంది ఈఈలకు ఎస్‌ఈలకు ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే.. 123 మంది ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్స్ ఇచ్చారు. దాంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఫలించింది. ఉద్యోగులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Next Story