ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలీవరీలు ప్రోత్సహించండి : వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

by Muthe.Rajitha |

సరైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలీవరీలు ప్రోత్సహించండి : వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సరైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సి-సెక్షన్ ఆడిట్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. గురువారం కోఠీలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి స్పష్టం చేశారు. నార్మల్ డెలివరీ వల్ల కలిగే లాభాలను, సి సెక్షన్ వల్ల జరిగే నష్టాలను యాంటి నాటల్ చెకప్స్ సమయం నుంచే గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు వివరించాలని ఆయన అధికారులకు సూచించారు.

నార్మల్ డెలివరీల సంఖ్య పెంచేందుకు, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇప్పించాలని మంత్రి ఆదేశించారు. మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో వసతులను మరింత మెరుగు పర్చాలని, ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీ చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల హాస్పిటల్స్‌లో గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అన్ని హాస్పిటల్స్‌లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన వార్డులలో ఏసీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీల భర్తీకి చర్యలు:

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. గతేడాది 8 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 6200లకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. ఇందులో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఈ పోస్టులన్నింటికీ రాత పరీక్షలు పూర్తయ్యాయని, వెంటనే ఫలితాలు విడుదల చేసి, నెల రోజుల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందికి సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ ఆర్ వీ కర్ణన్ , టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డీహెచ్ డాక్టర్ రవిందర్ నాయక్ తదితరులు ఉన్నారు.

Next Story