ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులా.. ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి: VC.Sajjanar

by Disha Web Desk 6 |
ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులా.. ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి: VC.Sajjanar
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీనిని అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. దీంతో అప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున నగరమంతా ప్రయాణిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ పథకం అమలు చేసి మూడు రోజులు పూర్తి కావడంతో.. పరిశీలించేందుకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హైదరాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్‌లో పల్లెలకు వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళల ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి స్కీమ్ మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలి. ఈ గొప్ప కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీని భాగస్వామిగా చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.

పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి.. సంస్థకు సహకరించాలి. ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా బస్సులను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాము. ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలి. 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చును. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటాము’’ అంటూ చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed