పల్నాడు జిల్లా మాచర్లలో పోరు రసవత్తరం.. ఈ సారి విజయం మాదే: జూలకంటి

by Disha Web Desk 9 |
పల్నాడు జిల్లా మాచర్లలో పోరు రసవత్తరం.. ఈ సారి విజయం మాదే: జూలకంటి
X

దిశ, మాచర్ల: కక్షలు కార్పణ్యాలు.. దాడులకు ప్రతిదాడులు.. హత్యకు ప్రతి హత్య.. ఇది పల్నాడు సంస్కృతి. ఆధిపత్య రాజకీయాలకు నెలవైన పల్నాడులో నిత్యం జరుగుతున్న తంతు ఇదే. అలాంటి మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రణరంగంలో తాడోపేదో తేల్చుకోవడానికి రాబోయే రెండున్నర వారాలే కీలకం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఇప్పటి వరకు జరిగిన తంతు ఒక ఎత్తు, ఇకపై జరగబోయేది ఇంకో ఎత్తు. అభ్యర్థుల రోజు వారి కదలికలపై ఎన్నికల నిబంధనల నీడ వెన్నాడుతూనే ఉంటుంది.

ఇప్పటికే కొందరు అభ్యర్థులు అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సర్దేసినట్లు చెబుతున్నారు. సామాజిక వర్గాలు, మహిళా గ్రూపులు, యువత టార్గెట్ అంతా వ్యవహారం సాగుతోంది. ఎంపీ అభ్యర్థులే ఈ సారి అత్యంత కీలకం. ప్రత్యేకించి మండుటెండ అయినా సరే ఏ మాత్రం అదరకుండా బెదరకుండా ప్రచారం హోరెత్తిస్తూనే ఉన్నారు. బలం, బలహీనతలను పూర్తిగా అంచనా వేసుకునే పనిలో పడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన అభ్యర్థులు సై అంటున్నారు. నామినేషన్ సమయంలోనే తమ బలాన్ని, బలగాన్ని నిరూపించుకోవడానికి సంసిద్ధులవుతున్నారు.

జనంతోనే జూలకంటి

పల్నాడులో పరిచయం అక్కరలేని రాజకీయ నేత.. మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదిన్నరలో తాగు, సాగునీటి అవసరాలను పరిష్కరించాలన్న ధ్యేయంతో ఉన్నారు. ఆధిపత్య రాజకీయాలు రాజ్యమేలే స్థానంలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి విరామం లేకుండా పర్యటిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము ఏం అభివృద్ధి చేస్తామో ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. రెండు దశాబ్దాలుగా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరని క్రమంలో ఇప్పుడు ఎలాగైనా గెలుపు రుచి చూడాలని పట్టుదలతో ఉన్నారు. జూలకంటి దూకుడుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శిబిరానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటీవల పట్టణంలో జరిగిన టీడీపీ భారీ ర్యాలీకి హాజరైన జూలకంటి అభిమానులను చూసి వైసీపీ శిబిరం కలవరపాటుకు గురైంది.

జన బలమే మా బలమంటున్న పిన్నెల్లి

మాచర్లలో గత రాజకీయాలకు భిన్నంగా పిన్నెల్లి నడుస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. నియోజకవర్గంలోన తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చిన రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లాలోనే ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షునిగా, ప్రభుత్వ విప్ గా కూడా నియమితులైన రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త తరహా రాజకీయాలకు తెర తీశారు. సొంత పార్టీలో, ప్రతి పక్షంలో ఎదురు లేదన్న తీరులో రాజకీయాలు నడిపారు. అడ్డగోలుగా పోలీసు పాలన సాగించారని ప్రతి పక్షాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో ఎవరి ఆస్తులకు భద్రత లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జూలకంటి రావడంతో పిన్నెల్లి కోటలు బీటలు వారతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story