సన్న ధాన్యంపై ‘ప్రైవేట్’ వ్యాపారుల నజర్.. కల్లాల వద్దే రైతులతో బేరాలు

by Kema Shiva Kumar |

యాసంగి సీజన్‌‌‌లో పెద్ద మొత్తంలో సన్నధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రైవేటు వ్యాపారులు రెడీ అవుతున్నారు.

సన్న ధాన్యంపై ‘ప్రైవేట్’ వ్యాపారుల నజర్.. కల్లాల వద్దే రైతులతో బేరాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్‌‌‌లో పెద్ద మొత్తంలో సన్నధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రైవేటు వ్యాపారులు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం చెల్లించే ధర కంటే ఎక్కువ చెల్లిస్తామని, కల్లాల వద్దకే వచ్చి తూకం వేస్తామని రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం గ్రేడ్-1 క్వింటాల్ రూ.2350, సాధారణ రకం రూ. 2300ల మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందజేస్తుంది. వ్యాపారులు మాత్రం క్వింటాల్ రూ.3100 వరకు కొనుగోలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రజలు దొడ్డు రకం కంటే సన్నబియ్యం తినేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం కిలో రూ.60 నుంచి రూ.70 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంకా డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసిన వ్యాపారులు ముందుగానే కొనుగోళ్లకు ప్లాన్ చే సుకుంటున్నారు.

పేదలకు సన్న బియ్యం కొరత

తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. ఈ పథకం ఏడాదంతా సాగించాలంటే 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. వాటి కోసం రైతుల నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. అంతమొత్తంలో ప్రభుత్వానికి దొరకడం కష్టమైన పని. గత వానాకాలంలో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడిలో 49 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరణ అంచనా వేసి చివరకు 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. వీటిని సీఎంఆర్ చేస్తే 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చాయి. ఇవి రేషన్ దుకాణాల ద్వారా 8నెలల వరకు పంపిణీ చేయవచ్చు. ప్రస్తుత యాసంగి సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం దిగుబడి రావచ్చని భావిస్తూ అందులో 35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రైవేట్ వ్యాపారులు సన్నధాన్యం కొనుగోళ్లకు దిగితే ఆశించిన స్థాయిలో సన్నధాన్యం సేకరణ జరగదు.

గత సీజన్‌లో ఆశించిన మేరకు కొనుగోలు చేయకపోవడంతో జనవరిలో పంపిణీ చేయాల్సిన సన్నబియ్యం మూడు నెలలు ఆలస్యంగా చేయాల్సి వచ్చింది. మే నెలలో కార్డుల సంఖ్య పెరుగుతుందని, లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరుకుంటుంది. దీంతో నెలకు రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాలి. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా ప్రైవేట్ వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులతో ముందుగానే ఒప్పందాలు చేసుకుని అడ్వాన్స్‌గా కొంత నగదు సైతం ముట్టజెబుతున్నారు. కల్లాల వద్దకు వెళ్లి తామే కొనుగోలుకు వస్తామని, రవాణా చార్జీలు, రోజుల తరబడి ధాన్యం రాసుల వద్ద కాపాలా ఉండే అవసరం ఉండదని, అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిసినా తామే భరిస్తామని వ్యాపారులు హామీలిస్తున్నారు. రైతులను ఒప్పించేందుకు నేరుగా వారి వద్దకు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం మాదిరిగా తాలు, తరుగు, సన్నధాన్యం గుర్తింపులో కొర్రీలు పెట్టబోమని రైతులకు హామీలు సైతం ఇస్తున్నారు. అంతేగాకుండా ధాన్యం తూకం వేసిన రెండు రోజులకే ఇంటికి వచ్చి నగదు ఇస్తామని, రోజుల కొద్ది డబ్బుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండదని చెబుతున్నట్లు సమాచారం.

ప్రైవేటు వ్యాపారులను నమ్మొద్దు : పౌర సరఫరాల శాఖ

రైతులు ఆరుగాలం పండించిన పంట ప్రైవేటు వ్యాపారుల చేతిలో పెట్టి మోసపోవద్దని పౌరసరఫరాల శాఖ హెచ్చరిస్తోంది. తూకంలో దగా చేసి తక్కువగా చూపించి మోసాలు చేస్తారని సూచించారు. ధాన్యం పచ్చిగా ఉందని, తాము ఆరబెట్టిన తరువాత తగ్గుతుందని చెప్పి బస్తాకు ఐదు కిలోల చొప్పున కోత పెడుతారని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద తూకాల్లో ఎలాంటి మోసాలు ఉండవని, నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. రవాణా ఖర్చులకు భయపడి ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం ఇస్తే నష్టపోతారని సూచిస్తున్నారు.

Next Story