- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ బోర్డు ఆదేశాలకు తూట్లు.. కార్పొరేట్ కాలేజీల దౌర్జన్యం
ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను ప్రైవేటు విద్యాసంస్థలు తుంగలో తొక్కుతున్నాయి. ఒకవైపు విద్యార్థులు వార్షిక పరీక్షల ప్రాక్టికల్స్‌లో నిమగ్నమై ఉంటే, మరోవైపు కార్పొరేట్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల వేటలో తలమునకలవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను ప్రైవేటు విద్యాసంస్థలు తుంగలో తొక్కుతున్నాయి. ఒకవైపు విద్యార్థులు వార్షిక పరీక్షల ప్రాక్టికల్స్‌లో నిమగ్నమై ఉంటే, మరోవైపు కార్పొరేట్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల వేటలో తలమునకలవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
దిశ ఎఫెక్ట్.. హోర్డింగ్స్ తొలగింపు
జూనియర్ కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అడ్మిషన్ల ప్రకటనలపై దిశ దిన పత్రిక వరుస కథనాలను ప్రచురించింది. జనవరి 24న ‘వసంత పంచమి వేళ అడ్మిషన్ల వెల్లువ’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనాల ప్రభావంతో ఎక్సలెన్షియా విద్యా సంస్థలు పలుచోట్ల తాము ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులను హుటాహుటిన తొలగించాయి. నిబంధనల ఉల్లంఘన బయటపడటంతో విద్యా సంస్థల యాజమాన్యాలు ఆత్మరక్షణలో పడ్డాయని పలువురు ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ చెబుతున్నారు. ఆయా ప్రైవేటు జూనియర్ కాలేజీలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతుండడంతో దిగువ మధ్యతరగతి, పేద విద్యార్థులు సైతం అన్ని సౌకర్యాలున్నా ప్రభుత్వ కాలేజీలను వదిలి ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారని వాపోతున్నారు.
అధికారుల కాలయాపన
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,500 ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలుండగా అందులో మెజారిటీ కాలేజీలు రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లా పరిధిలోని పలు కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు జరుగుతున్నట్లు సీజేఎస్ సంస్థ పలుమార్లు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. కానీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాల్సిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు మౌనం వహించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తప్పించుకుంటున్న డీఐఈఓలు
రూల్స్‌కు విరుద్ధంగా జరుగుతున్న అడ్మిషన్ల వ్యవహారంపై చర్యల గురించి డీఐఈఓలను ప్రశ్నిస్తే.. ‘మా పరిధిలో ఏమీ లేదు, తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఇంటర్ బోర్డు సెక్రెటరీ మాత్రమే’ అంటూ వారు చేతులెత్తేస్తున్నారు. ఫిర్యాదులు అందిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, ఫైళ్లను బోర్డుకు పంపామని చెబుతూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని ఒక కాలేజీలో దేవరకద్రకు చెందిన విద్యార్థి అడ్మిషన్ కోసం సంప్రదిస్తే ‘మా కాలేజీలో ఫీజులు ఇంతే ఉంటాయి, మీకు ఫీజు కట్టే స్తోమత ఉంటేనే జాయిన్ అవ్వండి’ అంటూ దురుసుగా మాట్లాడారని ఆ పేరెంట్స్ ‘దిశ’తో వాపోయారు. ప్రైవేటు పీఆర్వోలను పెట్టుకుని అడ్మిషన్ల విషయంలో భారీ స్థాయిలో దందాకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.






