పరీక్షలన్నీ వాయిదా వేయండి : యూనివర్సిటీలకు రమేష్ బాబు సూచన

by Naga Rani Yarlagadda |

కళాశాలలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఆదివారం వరకు చెల్లించకపోతే 3వ తేదీ నుంచి నిరవధిక బంద్..

పరీక్షలన్నీ వాయిదా వేయండి : యూనివర్సిటీలకు రమేష్ బాబు సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో : కళాశాలలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఆదివారం వరకు చెల్లించకపోతే 3వ తేదీ నుంచి నిరవదిక బంద్ నిర్వహిస్తామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. రూ.9 వందల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ అడిగితే విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశిస్తారా అని శనివారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఇప్పటివరకు ఇవ్వాల్సిన పదివేల కోట్ల రూపాయల బకాయిల్లో తక్షణం ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలన్నారు. మిగిలిన ఐదు వేల కోట్ల బకాయిలను వచ్చే మార్చి నెల ఆఖరు కల్లా కళాశాలలకు చెల్లించాలన్నారు. ప్రస్తుతం అన్ని పరీక్షలు వాయిదా వేయాలని యూనివర్సిటీలను కోరుతున్నాం అని తెలిపారు. నవంబర్ 6న లక్ష యాభై వేల మంది కాలేజీ స్టాఫ్‌తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 10 లేదా 11వ తేదీన పది లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో నిరసన తెలియజేస్తామన్నారు. ఈ నిరసన అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపడతామని తెలిపారు. కలెక్టరేట్‌ల ముట్టడి చేస్తామన్నారు. ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్ మెయిల్ చేయడమే అని స్పష్టం చేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల నిరసనలతో ప్రభుత్వాలు పడిపోయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కళాశాలల యాజమాన్యాలను బెదిరింపులతో భయపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలన్నారు.

Next Story