ప్రైవేటు కాలేజీలు కళకళ.. ప్రభుత్వ కళాశాలలు వెలవెల

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థులు లేక బోసిపోతున్నాయి.

ప్రైవేటు కాలేజీలు కళకళ.. ప్రభుత్వ కళాశాలలు వెలవెల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థులు లేక బోసిపోతున్నాయి. ప్రతి ఏటా అడ్మిషన్ల సమయంలో ఎదురయ్యే ఈ సమస్య ఈ సారీ తప్పడం లేదు. లక్ష అడ్మిషన్ల లక్ష్యం కేవలం మాటలకే పరిమితమైందని, ప్రైవేటు కళాశాలల ఆగడాలపై ఇంటర్మీడియట్ బోర్డు కన్నెత్తిచూడటం లేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ప్రారంభించిన 18 కాలేజీలతో కలిపి 430 మాత్రమే ఉన్నాయి. జూన్ 10 వరకు 35వేల అడ్మిషన్లు అయినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించడంతో లక్షకు పైగా అడ్మిషన్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆచరణలో మాత్రం ఇంటర్ బోర్డు ప్రభుత్వ కాలేజీలకు విద్యార్థులను రప్పించడంలో, ప్రైవేట్ కాలేజీల కట్టడిలో విఫలమవుతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్ లో 68,100 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 28,937 మంది (42.49శాతం) పాసయ్యారు. సెకండియర్ లో 74,161 మంది పరీక్షరాయగా, 39,630 మంది (53.44శాతం) మాత్రమే పాసయ్యారు.

పట్టించుకునేదెవరు?

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలకు మాత్రమే డీఐఈఓలు పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల సంఖ్య పెంచాలంటున్న ఇంటర్ బోర్డు ఆయా జిల్లాల్లో కాలేజీల మానిటరింగ్ పై దృష్టిసారించడం లేదు. రాష్ట్రంలో 11 ఆర్ఐవో పోస్టులు, ఏడుగురు డీఐఈవోలు కలిపి మొత్తం 18 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 26 జిల్లాలకు పూర్తిస్థాయి డీఐఈవోలు లేరు. ఆర్ఐవో పోస్టులను డీఐఈవోగా ప్రతిపాదన ఉన్నప్పటికీ మార్చలేదు. ప్రతి జిల్లాకు ఒక డీఐఈవోను నియమించాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ కు చెందిన ఓ కాలేజ్ ప్రిన్సిపల్ జిల్లా డీఐఈవోగా, మూడు కాలేజీల ప్రిన్సిపల్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో హెచ్ఈసీ కోర్సుకు విద్యార్థులు చేరడం లేదు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఇంకా కొన్ని జిల్లాల్లో హిందీని సెకండ్ లాంగ్వేజ్ గా తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు ఇటీవల రిక్రూట్ చేసుకున్న 1,232 జూనియర్ లెక్టరర్లలో హిందీ, హిస్టరీ లెక్చరర్లు ఉన్నారు. 6 జిల్లాల్లో 65 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వసతుల లేమి, పర్యవేక్షణ కరువు

సుమారు 4 లక్షల మంది ఉండే మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలో ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేక చాలామంది విద్యార్థులు డ్రాప్ ఔట్లుగా మిగిలిపోతున్నారు. జవహర్ నగర్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. దూరంగా ఉన్న ప్రైవేటు కాలేజీకి వెళ్లాలన్నా రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేరెంట్స్ చెబుతున్నారు. ఇటీవల 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన నిరుపేద విద్యార్థి తమకు సమీపంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేకపోవడంతో చదువు మానేస్తామని చెప్పడం శోచనీయం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస వసతులు కరువవడంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు చాలా చోట్ల అధ్వానంగా ఉన్నాయి. దీనికితోడు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల(డీఐఈఓ) పర్యవేక్షణ లేకపోవడంతో అధ్యాపకుల్లో బాధ్యతారాహిత్యం పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.

‘లక్ష అడ్మిషన్ల టార్గెట్’ మాటలకే..!

ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లక్ష అడ్మిషన్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ లక్ష్యం కేవలం మాటలకే పరిమిత అయ్యేలా ఉంది. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించకుండా, నాణ్యమైన విద్యను అందించకుండా కేవలం సంఖ్యల లక్ష్యాలు పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా సర్కారు కాలేజీల్లో చదువులను బలోపేతం చేయాలని కోరుతున్నారు.

ప్రైవేట్ కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి: యడవల్లి వెంకట స్వామి, NSUI రాష్ట్ర అధ్యక్షుడు

ప్రైవేట్ జూనియర్ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ఇంటర్మీడియట్ బోర్డు చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. మాదాపూర్, మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట్ ఏరియాల్లో దాదాపుగా రెండు వేల ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయి. అధిక ఫీజులు వసూలు చేయడం, అదనపు తరగతులు నిర్వహించడం, కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై విద్యార్థులను ప్రలోభపెట్టడం వంటివి బహిరంగ రహస్యాలే. అయినప్పటికీ, ఇంటర్ బోర్డు ప్రైవేటు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. ప్రైవేటు కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

Next Story