- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫీజు రియింబర్స్‌మెంట్‌పై కార్యాచరణకు సిద్దమైన ప్రైవేటు కాలేజీల యజమాన్యాలు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అన్ని రకాల కళాశాలల యాజమాన్యాలు ఏకమై, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ డిమాండ్లను సాధించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించనున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘాల సమాఖ్య అయిన ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతీ) బుధవారం హైదరాబాద్‌లో సమావేశమై కీలక తీర్మానాలను ఆమోదించింది. ఫతీ ఛైర్మన్ డాక్టర్ రమేష్ బాబు నిమ్మటూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై పలు డిమాండ్లు చేసింది. అందులో ప్రధానంగా ఈ నెలాఖరు నాటికి టోకెన్ సిస్టమ్‌లో ఇప్పటికే మంజూరు చేయబడిన రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేయాలి. 2023-24 విద్యా సంవత్సరం వరకు ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మూడు నెలల్లోగా విడుదల చేయాలని కోరింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఆరు నెలల్లోగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులను నాలుగు వాయిదాలలో విడుదల చేసేలా ఒక అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయాలని ఫతీ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
ఇంజనీరింగ్, డిగ్రీ, బీ.ఎడ్, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల కాలేజీల యాజమాన్యాలు కలిసికట్టుగా పోరాడాలని తీర్మానించాయి. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా ఉద్యమించాలని నిర్ణయానికి వచ్చాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు పెద్ద ఎత్తున రావాల్సి ఉందని, దీని వల్ల కళాశాలల నిర్వహణ భారంగా మారిందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధ్యాపకుల వేతనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కష్టంగా మారిందని, కొన్ని కళాశాలలు మూసివేత అంచున ఉన్నాయని పేర్కొంటున్నాయి.
ప్రభుత్వంతో చర్చలకు నిర్ణయం
సమస్యల పరిష్కారం కోసం ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలతో పాటు, విధానపరమైన మార్పులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, చర్చలు విఫలమైతే సమ్మెతో సహా ఇతర ఆందోళన కార్యక్రమాలకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల జాప్యం వల్ల కలిగే పరిణామాలను వివరించడానికి సీఎం, మంత్రుల మండలిని కలవాలని ఫెడరేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు ఛైర్మన్, సెక్రటరీ జనరల్, ట్రెజరర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలతో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఫతీ కార్యనిర్వాహక మండలిలో ఛైర్మన్ డాక్టర్ నిమ్మటూరి రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ కోటాల శంకరప్ప రవి కుమార్, ట్రెజరర్ కొడాలి కృష్ణ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కాతం సునీల్ కుమార్ సహా పలువురు వైస్ ఛైర్మన్‌లు, జనరల్ సెక్రటరీ, మీడియా సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఫైనాన్స్ సెక్రటరీలు, కార్యనిర్వాహక సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ సభ్యులందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నత విద్యను పరిరక్షించడానికి, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.






