అడ్మిషన్ల వేళ ఆగిన ఫైళ్లు.. ఉన్నత విద్యామండలిలో విచిత్ర పరిస్థితి

by Naga Rani Yarlagadda |

అడ్మిషన్ల సమయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో కొన్ని ప్రైవేట్ కాలేజీల ఫైళ్లు నిలిచిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అడ్మిషన్ల వేళ ఆగిన ఫైళ్లు.. ఉన్నత విద్యామండలిలో విచిత్ర పరిస్థితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడ్మిషన్ల సమయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో కొన్ని ప్రైవేట్ కాలేజీల ఫైళ్లు నిలిచిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం రావాల్సిన అనుమతులు రాకపోవడం, మరోవైపు నిబంధనలను బేఖాతరు చేస్తూ కొన్ని యాజమాన్యాలు అక్రమ అడ్మిషన్లకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది.

ఇతర కాలేజీల పేర్లతో..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, ఇతర అనుమతులు లేని కారణంగా కొన్ని కాలేజీల ఫైళ్లు ఉన్నత విద్యామండలిలో పెండింగ్‌లో పడ్డాయి. అయితే, అడ్మిషన్ల సీజన్ ముగిసిపోతుండటంతో సదరు కాలేజీల యాజమాన్యాలు అడ్డదారి తొక్కుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు పర్మిషన్లు లేకపోయినప్పటికీ, అనుమతులు ఉన్న ఇతర అనుబంధ కాలేజీల పేర్లను వాడుకుంటూ విద్యార్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతూ అడ్మిషన్లు కానిచ్చేస్తున్నట్టు తెలుస్తోంది.

సెక్రెటరీ అండదండలు..

ఉన్నత విద్యామండలిలో ఏ కాలేజీకి సంబంధించిన ఫైల్ కదలాలన్న ఉన్నత విద్యా మండలికి చెందిన ఒక కీలక సెక్రెటరీ స్థాయి అధికారి హస్తం ఉన్నట్టు బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని తెలిసినా సదరు అధికారి ముందస్తుగానే సంతకాలు పెట్టి అనుమతుల కోసం పై‌అధికారుల వద్దకు పంపుతున్నట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సెక్రెటరీ అండదండలతోనే కొన్ని కాలేజీల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫైళ్లను కదిపాయని, నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించాయని సమాచారం. అయితే ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్లు ఈ ఫైళ్లకు అడ్డుకట్టవేయడం గమనార్హం. ఈ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఉన్నత విద్యా మండలికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల కొన్ని కాలేజీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, వివాదాస్పదంగా ఉన్న సదరు కాలేజీల ఫైళ్లన్నింటికీ ఉన్నతాధికారులు తక్షణమే బ్రేక్ వేశారు. ఆయా కాలేజీలపై వచ్చిన ఫిర్యాదులపై ఉన్నత విద్యామండలి అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు కాలేజీల గుర్తింపును సరిచూసుకోవాలని అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

Next Story