అనుమతులు లేకుండా పోలవరం విస్తరణ.. ఏపీ తీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ అసహనం

by Naga Rani Yarlagadda |

ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సర్కారు పోలవరం విస్తరణ పనులు చేపడుతున్నదని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్‌ బొజ్జా అన్నారు.

అనుమతులు లేకుండా పోలవరం విస్తరణ.. ఏపీ తీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ అసహనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సర్కారు పోలవరం విస్తరణ పనులు చేపడుతున్నదని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్‌ బొజ్జా అన్నారు. రెండు సొరంగాలను 20 వేల నుండి 40 వేల క్యూసెక్కులకు, కుడి ప్రధాన కాలువను 10 వేల నుండి 17,548 క్యూసెక్కులకు విస్తరించిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) 17వ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ కేజీబీవో కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పీపీఏ సీఈఓ అతుల్ జైన్ అధ్యక్షత వహించగా, కేంద్ర జల సంఘం, జలశక్తి మంత్రిత్వ శాఖ, ఇతర విభాగాల అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. ముందుగా.. రాహుల్ బొజ్జా మాట్లాడుతూ సొరంగం, కాలువల విస్తరణ పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రం ఇలా చేసుకుంటూ పోతే పరిణామాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఎగువన ఉన్న రాష్ట్రాలు కూడా ఇలాగే చేస్తే దిగువకు నీరు వస్తుందా అని పేర్కొన్నారు. ఈ తరహా చర్యలను తాము వివిధ వేదికల్లో వ్యతిరేకిస్తున్నామని, అధికారులకు అనేక లేఖలు రాస్తున్నామని తెలిపారు. అయినా పీపీఏ విస్తరణలను ఆపలేకపోయిందని ఆరోపించారు. ఇటువంటి కార్యకలాపాలను అరికట్టేందుకు పటిష్ట యంత్రాంగాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.

పీపీఏ ఆఫీసు తరలింపునకు అంగీకారం

పీపీఏ కార్యాలయాన్ని ఏపీకి తరలించేందుకు ఈ సమావేశంలో అంగీకరించారు. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి తరలించే అంశంపై 16వ పీపీఏ సమావేశంలోనే అంగీకరించగా.. ఈ విషయాన్ని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ ధ్రువీకరించారు. ఎఫ్ఆర్‌ఎల్ స్థాయి 45.72 మీటర్ల వరకు భూసేకరణ, పునరావాసం కోసం ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న జాయింట్ సర్వే స్థితిపై చర్చించారు. అయితే.. ఫేజ్-1 (41.15 మీ) కింద ముంపునకు గురికాని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జాయింట్ సర్వే పూర్తయినప్పటికీ, తమ రాష్ట్రంలో ఎందుకు అలాంటి సర్వే ప్రతిపాదించలేదని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు.

భద్రాచలం, డ్రైనేజీ సమస్యలు..

భద్రాచలం, డ్రైనేజీ సమస్యలకు సంబంధించి రక్షణ పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని, అధ్యయనం కోసం ఆరు పెద్ద వాగుల సర్వే జరగాల్సి ఉందని రాహుల్ బొజ్జా తెలిపారు. ఈ సర్వే తర్వాత 8 వాగుల సరిహద్దు నిర్ణయ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫేజ్-1 (41.15 మీటర్ల) నిల్వ వరకు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే, భద్రాచలం పట్టణం గుండా నీరు వెళ్లే ఏటపాక అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ (సిల్ లెవల్ 40.250) మునిగిపోతుందని, దీనివల్ల గోదావరి నదిలోకి నిరంతరం పంపింగ్ అవసరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీఈఓ అతుల్ జైన్, ఈ అవుట్‌ఫాల్ రెగ్యులేటర్‌లను సందర్శించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ, ఏపీ అధికారులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ అంగీకరించారు.

నిలిచిన బనకచర్ల!

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అంశాన్ని ఈ సమావేశంలో తెలంగాణ లేవనెత్తింది. పీబీఎల్‌పీకి మూలం పోలవరం ప్రాజెక్ట్ అని, అయితే.. ఈ ప్రాజెక్ట్ పరిధి కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. తెలంగాణ అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా పోలవరం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుండి 23 టీఎంసీల నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం (ఎల్‌ఐఎస్) అని ఏపీ అధికారులు వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం దాని నిర్మాణ పనులు నిలిపివేశామని ధ్రువీకరించారు.

Next Story