ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు.. అక్కడ భారీ బహిరంగ సభ!

by Disha Web Desk 2 |
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు.. అక్కడ భారీ బహిరంగ సభ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అధునాతనంగా తీర్చిదిద్దనున్న నేపథ్యంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి రానున్నారు. అంతేకాకుండా ఇతర అభివృద్ధి పనులకు సైతం తెలంగాణ పర్యటనలో భాగంగా శంకుస్థాపన చేయనున్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ అదే రోజు మరో వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇప్పటికే మొదటి విడుతలో భాగంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు అత్యంత దూరమైన గమ్యానికి ఈ రైలు నడుస్తోంది. కాగా వచ్చే నెలలో సికింద్రాబాద్ నుంచి ఆధ్యాత్మిక పట్టణమైన తిరుపతికి మరో వందేభారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగసభ

ప్రధాని మోడీ రాక సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవాల అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ఈ సభ నిర్వహించే అవకాశముంది. కాగా జన సమీకరణపైనా బీజేపీ దృష్టి సారిస్తోంది. కొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సభ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. గతంలో పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అదే తరహాలో సభను సక్సెస్ చేసి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని పార్టీ భావిస్తోంది. ప్రధాని మోడీ జనవరిలోనే ఈ పనులను ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. అనంతరం ఫిబ్రవరిలో ఆయన రాక ఉంటుందని భావించినా కుదరలేదు. ఈసారైనా ప్రధాని పర్యటన ఉంటుందా? లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈసారి మాత్రం పర్యటన కచ్చితంగా ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.



Next Story

Most Viewed