కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు పాలసీ సిద్ధం చేయండి.. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు

by Kema Shiva Kumar |

వాణిజ్య పన్నుల శాఖలో 4.7శాతం, గనుల శాఖ ఆదాయంలో 18.6 శాతం పెరుగుదల కనిపిస్తుందని, ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు పాలసీ సిద్ధం చేయండి.. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వాణిజ్య పన్నుల శాఖలో 4.7శాతం, గనుల శాఖ ఆదాయంలో 18.6 శాతం పెరుగుదల కనిపిస్తుందని, ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. ఈ భేటీలో కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ పూడిక తీత పనులతో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని, ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని మంత్రి ఉత్తమ్ వివరించారు. మొదట ఒక ప్రాజెక్టులో పూడికతీత కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకం పనులను పూర్తిగా ట్రైబల్ ఏజెన్సీల ద్వారా నిర్వహించాలని మంత్రులు సూచించారు. గిరిజనులకు యంత్ర సామాగ్రి అందుబాటులో ఉండదు ఈ నేపథ్యంలో ఐటీడీఏలోని ఇంజనీరింగ్ విభాగం యంత్ర సామాగ్రి సహాయం అందించాలని మంత్రులు సూచించారు. దీని ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు మూడు వారాల్లో విధి విధానాలు రూపొందించాలని మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బీ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మైన్స్ డైరెక్టర్ శశాంక, స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సురేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Next Story