‘SLBC‌’ ప్లాన్-బి అమలుకు సన్నాహాలు.. మన్నెవారిపల్లి ఔట్‌లెట్ నుంచి TBM తొలగింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-09 06:56:02  IST  )

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గం పనులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్-బి అమలు చేయబోతోంది.

‘SLBC‌’ ప్లాన్-బి అమలుకు సన్నాహాలు.. మన్నెవారిపల్లి ఔట్‌లెట్ నుంచి TBM తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గం పనులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్-బి అమలు చేయబోతోంది. సాంకేతిక సమస్యలు, భౌగోళిక అడ్డంకుల దృష్ట్యా ఇప్పటి వరకు కొనసాగించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) పద్ధతిని పక్కన పెట్టనుంది. సొరంగం తవ్వకంలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించేందుకు ఇకపై ‘డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్’ (Drilling and Blasting) పద్ధతిని అనుసరించాలని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు ఇప్పటికే మన్నెవారిపల్లి (Mannevaripally) ఔట్‌లెట్ వైపు ఉన్న భారీ టన్నెల్ బోరింగ్ మెషిన్‌ను తొలగించే ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యంత్రాన్ని బయటకు తీసేందుకు ఇంజనీర్లు, సిబ్బంది సుమారు నెల రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది.

గతేడాది ప్రమాదంతో పూర్తిగా నిలిచిన పనులు..

గతేడాది ఫిబ్రవరిలో దోమలపెంట (Domalapenta) ఇన్‌లెట్ వైపు సొరంగం లోపల జరిగిన ఘోర ప్రమాదం కారణంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో యంత్రాలు ఇరుక్కుపోవడం, భౌగోళికంగా రాళ్ల స్వభావం అనుకూలించకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రెండు వైపులా పనులు ఆగిపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది.

హెలీబోర్న్ మాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే నివేదికతో ముందుకు..

సొరంగం మార్గంలో ఉన్న శిలల పటుత్వం, భూగర్భ జలాల ఉనికిని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల హెలీబోర్న్ మాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే (Heliborne Magnetic Geophysical Survey)ను నిర్వహించింది. ఈ సర్వే నివేదిక అధికారులకు అందడంతో దాని ఆధారంగా తవ్వక పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కొత్త పద్ధతిలో పనులు చేపడితే తక్కువ సమయంలోనే మిగిలిన తవ్వకాన్ని పూర్తి చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ప్రణాళికతోనైనా ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడుతుందని ఆ ప్రాంత రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story