- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సన్నాహాలు.. నాలాలు నుంచి చెత్త సేకరణ వరకూ పూర్తి రికార్డులు
స్వచ్ఛ సర్వేక్షణ్‌కు జీహెచ్ఎంసీ ముందస్తు కార్యక్రమాలను ముమ్మరం చేసింది. సర్వేక్షణ్ అంటే కేంద్రం నుంచి బృందాలు రాగానే మార్కులు, ర్యాంకుల కోసం హడావుడి చేసే కార్యక్రమం కాదని అధికారులు చెబుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: స్వచ్ఛ సర్వేక్షణ్‌కు జీహెచ్ఎంసీ ముందస్తు కార్యక్రమాలను ముమ్మరం చేసింది. సర్వేక్షణ్ అంటే కేంద్రం నుంచి బృందాలు రాగానే మార్కులు, ర్యాంకుల కోసం హడావుడి చేసే కార్యక్రమం కాదని అధికారులు చెబుతున్నారు. ఏడాదంతా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 12,500 మార్కులకు సంబంధించిన అన్ని కార్యక్రమాల వివరాలు, డాక్యుమెంట్స్, బిల్లులు, రికార్డులతో సహా కేంద్ర బృందానికి అందజేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే నాలాలు, డ్రెయినేజీలు, ఎస్టీపీలు, చెరువుల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, తడి, పొడి చెత్త వేరు చేయడం వంటి కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ కార్యక్రమాలను అధికారులు స్పీడప్ చేశారు.
సర్వేక్షణ్‌లో అంశాలు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పారిశుధ్య నిర్వహణ మాత్రమే కాదు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. నగరంలోని నాలాలు, డ్రెయినేజీల నిర్వహణ రెగ్యులర్‌గా చేస్తున్నారా? సర్వేక్షణ్ కోసమే చేస్తున్నారా? వివరాలను ఆధారాలతో సహా రికార్డుల రూపంలో రూపొందించాల్సి ఉంటుంది. చెరువుల నిర్వహణ, పరిరక్షణకు చేస్తున్న కార్యక్రమాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతోపాటు ఇంటింటి చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల సామర్థ్యం, రోజువారీగా కవర్ చేస్తున్న ఇండ్ల సంఖ్య, ఉత్పత్తి అవుతున్న చెత్త, తడి, పొడి చెత్తను వేరు చేస్తున్న ఆధారాలను అందుబాటులో ఉంచాల్సిందే. చెత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీలు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీ సెంటర్, దీనికి సంబంధించిన అధికారిక పత్రాలను సైతం కేంద్రం నుంచి ప్రతినిధులు పరిశీలించనున్నారు. గ్రేటర్‌లో ముఖ్యంగా నిర్మాణ వ్యర్థాల సమస్య సవాల్‌గా మారింది. అయితే సీ అండ్ డీ వేస్ట్ కలెక్షన్, ట్రాన్స్‌పోర్టేషన్, ప్రాసెసింగ్, డిస్పోజల్, అనుమతిలేకుండా డంప్ చేస్తున్న వారికి పెనాల్టీలు వేయడం వంటి అంశాలను పొందుపర్చనున్నారు. ఆర్ఆర్ఆర్ సెంటర్లు ఏర్పాటు, సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్, ప్రివెన్షన్ ఆఫ్ ఓపెన్ ఢిపకేషన్ వంటి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. వీటిన్నింటికి కలిపి 12,500 మార్పులు ఉంటాయి.
ప్రచార కార్యక్రమాలు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి నిర్వహించిన కార్యక్రమాలు, క్యాలెండర్ షెడ్యూల్ పత్రాలను చూపించాలి. ప్రచార సర్క్యులర్‌లు/ఆదేశాలు, ఫొటోగ్రాఫ్‌లు (అందుబాటులో ఉన్నచోట జియో-ట్యాగ్ చేయబడినవి), అధికారిక సోషల్ మీడియా పోస్ట్‌లు, భాగస్వామ్య రికార్డులు, ఐఈసీ సామగ్రి, కార్యాచరణ నివేదికలు అవసరముంది. ప్రజా మరుగుదొడ్ల వినియోగ ప్రచారాలు, హాట్‌స్పాట్ ప్రచారాలు (ఉమ్మివేయడం, బహిరంగ మూత్ర విసర్జన, బహిరంగ మలవిసర్జన) చేస్తున్నారా? చేస్తే ఆధారాలతో అందజేయాల్సిందే. ప్రచారం చేయడానికి అవగాహన ఒప్పందాలు, సమావేశాల రికార్డులు, మీడియా లింకులు సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. వీటితోపాటు స్థానిక చాంపియన్లు, బ్రాండ్ అంబాసిడర్లు, రాజకీయ/పరిపాలనా నాయకత్వం ప్రచార డేటా (కుటుంబాలు, మార్కెట్లు, పాఠశాలలు, హాట్‌స్పాట్‌లు) పాల్గొన్న రికార్డులు (ప్రపంచ పర్యావరణ దినోత్సవం, సఫాయి అప్నావో బీమారీ భగావో, ఏక్ ఘంటా, ఏక్ తారీఖ్, ఏక్ సాథ్, పాఠశాల ప్రచారాలు మొదలైన కార్యక్రమాలు)లకు వివరాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కార్మికుల సంక్షేమం సైతం
పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని సైతం అంశంగా చేర్చారు. మూడేండ్లుగా పారిశుధ్య కార్మికులందరి జాబితా, వారి వివరాలు, శిక్షణ రికార్డులు, వార్షిక ఆరోగ్య తనిఖీ (డిజిటల్ లేదా భౌతిక) వివరాలను సంబంధించిన రికార్డులను తయారు చేస్తున్నారు. పారిశుధ్య కార్మికుల కోసం హెల్ప్‌లైన్ విధానం వివరాలు (హెల్ప్‌లైన్ నంబర్ / పోర్టల్ లింక్ / యాప్ లింక్ / వాట్సాప్), నమూనా అభ్యర్థనలు/ఫిర్యాదులు, వాటి పరిష్కార రికార్డులు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం తో పాటు ఫిర్యాదుల నిర్వహణ కోసం ప్రత్యేక విధానం ఏమైనా ఉందా? ఉంటే పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కార్మికుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి తీసుకున్న చర్యలు, బ్యాంకులతో సంప్రదింపులు, రుణ మేళాల కోసం బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకున్న రికార్డులను సైతం అందజేయాల్సి ఉంటుంది.






