- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా సాధికారతకు ‘ప్రజా పాలన’ ప్రణాళిక.. వారం రోజుల పాటు అట్టహాసంగా వారోత్సవాలు
తెలంగాణలో మే 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు జరగనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులతో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహించనున్నారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభం
మే 29న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేకంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వెత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభించి, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించనుండటం ఈ వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుంది. మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. బ్యాంకురుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నామని చెప్పారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు.
మే 25న సౌర విద్యుత్ ప్లాంట్లు, ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు
- వికారాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, అసిఫాబాద్ ప్రాంతాల్లో 0.5 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ల ప్రారంభం.
- మహిళా సంఘాలచే నడిచే 450 ఆర్టీసీ బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం.
- మహిళా సంఘాలకు బ్యాకింగ్ లోన్లు, వడ్డీ లేని రుణాలు విడుదల, ఉత్తమ సంఘాల సత్కారం.
- 2026-27 కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన.
మే 26 సామాజిక సమీకరణ దినం
- దివ్యాంగులు, వృద్ధ మహిళల ఎస్‌హెచ్‌జీల ఏర్పాటు.
- టీన్ ఏజ్ బాలికలతో మాక్ పార్లమెంట్ నిర్వహణ.
మే 28 మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలు
- మహిళా సంఘ భవనాలు, వర్క్ షెడ్లు, మహిళా గోదాముల నిర్మాణాలకు శంకుస్థాపనలు.
- భూమి పూజలు, పనుల ప్రారంభోత్సవాలు.
మే 29 రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్
- హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం.
- మండల స్థాయిలో రుణమేళాలు.
- మండల సమాఖ్యల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు.
- కోళ్ల పెంపకం యూనిట్లు-500, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు.
మే 30, 31 మహిళల భద్రత, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు
- జిల్లా మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం.
- గుర్తించిన ప్రాంతాల్లో పెట్రోల్ పంపులకు భూమిపూజలు.
- జిల్లా సమాఖ్యల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు.
- టీన్ ఏజ్ బాలికలకు సైకిళ్ల పంపిణీ.
- అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా చదువు నేర్చుకున్న మహిళలకు సత్కారం.
- పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ






