- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్-చండీగఢ్ ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అధికారుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో (6E 108) విమానం చండీగఢ్ (మొహాలీ) లోని షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. గ్రౌండ్‌లో విమానం నిలిచి ఉన్న సమయంలో క్యాబిన్‌లో ఉన్న ఓ ప్రయాణికుడికి చెందిన ఎలక్ట్రానిక్ పరికరం (పవర్ బ్యాంక్) అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో క్యాబిన్ అంతటా దట్టమైన పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వెంటనే స్పందించిన సిబ్బంది
క్యాబిన్‌లో పొగలు రావడాన్ని గమనించిన విమాన సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ఆందోళన చెందకుండా శాంతింపజేసి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వారందరినీ అత్యవసరంగా, సురక్షితంగా కిందకు దించేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ఇండిగో సంస్థ ప్రకటన
ఈ ఘటనపై ఇండిగో సంస్థ అధికారికంగా స్పందించింది. ‘విమానం ల్యాండ్ అయి గ్రౌండ్‌లో స్థిరంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే వారిని సురక్షితంగా టెర్మినల్‌కు తరలించాము. వారందరి బాగోగులు చూసుకుంటున్నాము. సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాం. పూర్తి స్థాయి భద్రతా తనిఖీలు నిర్వహించిన అనంతరమే ఈ విమానాన్ని తిరిగి కార్యకలాపాలకు వినియోగిస్తాం’ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరపనున్నారు.
గతంలోనూ తప్పిన ప్రమాదం
మార్చి నెలాఖరులో విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న మరో ఇండిగో విమానంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గాల్లో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తి ఒక ఇంజిన్ విఫలం కావడంతో, అధికారులు అప్రమత్తమై న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 10:54 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానయాన ప్రొటోకాల్ ప్రకారం తగిన చర్యలు తీసుకోవడంతో ఆ విమానంలోని 161 మంది ప్రయాణికులు, సిబ్బంది ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు పవర్ బ్యాంక్ పేలుడు ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.






