నాసిరకంగా సెక్రటేరియట్ నిర్మాణం.. ఏ క్షణమైనా పెచ్చులూడి పడిపోయే ఛాన్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-22 02:21:29  IST  )

తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అనేకమైన నాణ్యతా లోపాలు ఉన్నాయని విజిలెన్స్​ అండ్​ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో అధికారులు గుర్తించారు.

నాసిరకంగా సెక్రటేరియట్ నిర్మాణం.. ఏ క్షణమైనా పెచ్చులూడి పడిపోయే ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అనేకమైన నాణ్యతా లోపాలు ఉన్నాయని విజిలెన్స్​ అండ్​ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో అధికారులు గుర్తించారు. ఈ మేరకు సచివాలయ నిర్మాణంపై విజిలెన్స్​విభాగం నివేదికను ఆర్‌అండ్‌బీ శాఖకు అందించారు. ఇటీవల సచివాలయం పై కప్పు నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. దీంతో సచివాలయ నాణ్యతపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్‌అండ్‌బీ శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్మాణం కోసం వాడిన మెటీరియల్‌ను పరిశీలించారు. అనంతరం వాటి రికార్డులను పరిశీలించారు. భౌతికంగా కూడా నిర్మాణాలను పరిశీలించారు. భవన పిల్లర్లు, స్లాబ్‌లు మినహా మిగిలినవి అంత నాణ్యతతో కూడుకున్నవి కావని, ప్లాస్టర్​ఆఫ్​పారిస్​తరహలో ఉండే మెటీరియల్‌ను సచివాలయం లుకింగ్ డిజైన్​కోసం వాడారని గుర్తించారు.

అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చారు. దీని స్థానంలో వేరే మెటీరియల్‌ను ఉపయోగించి నిర్మాణాలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు వాడిన మెటీరియల్ ఏ క్షణమైనా, ఎవరిమీద అయిన పడితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆర్‌అండ్‌బీ శాఖ పూర్తి స్థాయి నాణ్యత నివేదికను కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి ఎలాంటి పరిష్కారం అవసరమని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కనుగొంటారని తెలుస్తోంది. ఇప్పటివరకు సచివాలయ పనులు పూర్తి కాలేదని ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వలేదని తెలిసింది. సచివాలయ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.500 నుంచి 600 కోట్లను గత ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం అంచనా రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని తాత్కాలిక రిపోర్టులో విజిలెన్స్ వెల్లడించింది.

కంప్యూటర్ల ​కొనుగోళ్లలో గోల్‌మాల్..

సచివాలయంలో అవసరమైన కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్​పరికరాల కొనుగోళ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటి కోనుగోళ్లకు రూ.320 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుండగా.. నిధులకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే దశల వారీగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఒకేసారి కొనుగోలు చేస్తే ఎక్కువ మొత్తం అవుతుందని, దీంతో ఆర్థిక శాఖ, ప్రభుత్వ అనుమతులు ఎందుకు తీసుకోలేదనే జవాబు చెప్పాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. సెక్రెటేరియట్ మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్​వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి రూ.320 కోట్లకు పైగా ఖర్చు దాటిందని నివేదికలో పేర్కొన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు విజిలెన్స్​నివేదికలో పొందుపరిచారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పనులు పూర్తి చేసినట్టు విజిలెన్స్​గుర్తించింది. రూ.320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.

Next Story