Ponguleti: రెవెన్యూ ప్రక్షాళన.. ధరణి లోపాలపై ‘కోడ్ ఆడిట్‌’కు మంత్రి ఆదేశం

by Kema Shiva Kumar |

ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవస్థాగత లోపాలను అరికట్టేందుకు తక్షణమే 'కోడ్ ఆడిట్' కు ఆదేశించారు.

Ponguleti: రెవెన్యూ ప్రక్షాళన.. ధరణి లోపాలపై ‘కోడ్ ఆడిట్‌’కు మంత్రి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తీగ లాగితే డొంక కదిలినట్లుగా ధరణి పోర్టల్ వ్యవహారం ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకు నిర్మించవలసిన వ్యవస్థనే ఆనాటి ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆయన మండిపడ్డారు. ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన సంఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించగా.. దిగ్భ్రాంతికరమైన అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని, వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని స్పష్టం చేశారు. ఇవాళ సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి కమిటీతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు ధరణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ చేసిన సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. అలాగే మానవ ప్రమేయంతో తప్పులు చేసే విధంగా పోర్టల్‌ను రూపొందించారని, భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న సమాచారం లభించకుండా లాగిన్‌లను డిలీట్ చేశారని పేర్కొన్నారు. అత్యంత రహస్యంగా ఉండవలసిన లాగిన్ వివరాలు లేకుండా పోయాయని ఉన్నత స్థాయి కమిటీ విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు.

‘టెర్రాసిస్’ అప్పగించడం వల్లే సమస్యలు..

నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూ లావాదేవీల సమాచారం లభించకుండా చేశారని, ఫోరెన్సిక్ ఆడిట్‌లో 'కోడ్ ఆడిట్' నిర్వహించలేదన్న విషయం బహిర్గతమైందని అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ధరణి పోర్టల్‌పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను ‘టెర్రాసిస్’ అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించామన్నారు.

భవిష్యత్తులో ఏ పొరపాట్లు జరగవు..

సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామన్నారు. ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని, భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా, అధికారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా, ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేలా ‘భూభారతి’ పోర్టల్‌ను నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజల భూముల విషయంలో ఎటువంటి రాజీ పడబోమని, ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామని తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.

Next Story