అటకెక్కిన సర్వీస్ రూల్స్ సవరణ.. తీవ్ర సంక్షోభంలో పాలిటెక్నిక్ కాలేజీలు

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రిన్సిపాల్ నుంచి ఆఫీస్ సిబ్బంది వరకు గత నాలుగేళ్లుగా ప్రమోషన్లు లేకపోవడంతో బోధనా నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది.

అటకెక్కిన సర్వీస్ రూల్స్ సవరణ.. తీవ్ర సంక్షోభంలో పాలిటెక్నిక్ కాలేజీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రిన్సిపాల్ నుంచి ఆఫీస్ సిబ్బంది వరకు గత నాలుగేళ్లుగా ప్రమోషన్లు లేకపోవడంతో బోధనా నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది. రిటైర్ అయిన ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉండటం, అలాగే పోస్టులు మంజూరు కాని కాలేజీల్లో సైతం అనర్హులైన వ్యక్తులు ప్రిన్సిపాల్‌గా, ఓఎస్‌డీలుగా వ్యవహరిస్తూ కళాశాలల నిర్వహణను అస్తవ్యస్తం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అనధికార వసూళ్లు, పైరవీలు

అర్హత లేని వ్యక్తులు కేవలం పైరవీలతోనే ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్, ఓఎస్‌డీ పోస్టులను దక్కించుకుంటున్నారని వాదన ఇటీవల అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక రిటైర్డ్ అధికారి అండతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, తమకు నచ్చినవారికి మాత్రమే ఎఫ్‌ఏసీ, ఓఎస్‌డీ వంటి పోస్టులు ఇస్తున్నారని వాపోతున్నారు. ఈ రిటైర్డ్ అధికారి కమిషనర్‌ను తప్పుదోవ పట్టించి, ఆరోపణలు ఉన్న వ్యక్తులకు ఇన్‌చార్జ్, ఓఎస్‌డీ పోస్టులు ఇస్తూ విద్య నాణ్యతను దిగజార్చుతున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఆయనకు అనుకూలంగా రూల్స్..

పాలిటెక్నిక్ సిబ్బందికి వేతన సవరణ తర్వాత కొత్త సర్వీస్ రూల్స్ కోసం పాత కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటైంది. కానీ, నవీన్ మిట్టల్ బదిలీ అయిన తర్వాత ఆ రిటైర్డ్ అధికారి చక్రం తిప్పి ప్రభుత్వానికి పంపిన ఫైల్‌ను వెనక్కి రప్పించారని తెలుస్తోంది. కొత్తగా విడుదలైన జీవో పీఆర్సీ 26 ప్రకారం సర్వీస్ రూల్స్ సవరణ చేయాల్సి ఉండగా, ఈ అధికారి తనకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, దీని కోసం ఫైల్‌ను తిరగరాస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమిషనర్ మళ్లీ కొత్తగా కమిటీ ఏర్పాటు చేసి, సదరు అధికారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story