- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బహుభాషావేత్త, పరిశోధకుడు, పండితుడు డాక్టర్ మలయశ్రీ కన్నుమూత..
ప్రముఖ తెలుగు పరిశోధకుడు, బహుభాషావేత్త డాక్టర్ మలయశ్రీ (86) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ పరిశోధకుడు, బహుభాషా కోవిదుడు, హేతువాది డాక్టర్ మలయశ్రీ (86) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగునేల ఒక గొప్ప మేధావిని, పండితుడిని కోల్పోయిందని సాహితీ లోకం కన్నీరు పెడుతోంది.
సాహితీ ప్రస్థానం - అరుదైన పరిశోధన
మలయశ్రీ కేవలం కవి మాత్రమే కాదు, అద్భుతమైన కథకుడు, నవలాకారుడు, చరిత్రకారుడు కూడా. వెయ్యేళ్ల కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్రను లోతుగా పరిశోధించి, దానిని అక్షరబద్ధం చేయడం అనన్య సామాన్యం. తన జీవితకాలంలో 150కి పైగా పుస్తకాలను మలయశ్రీ వెలువరించారు. ఆయన రాసిన గ్రంథాలు నేడు ఎందరో విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన రచించిన ‘బాల సాహిత్యం’ ఎందరో చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దింది. నాస్తిక, హేతువాద భావజాలాన్ని కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిన ధీశాలి మలయశ్రీ. తన తండ్రి మరణించినా.. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, పాడె కట్టడాన్ని నిరాకరించి, మంచంపైనే అంత్యక్రియలు నిర్వహించి తన నిబద్ధతను చాటుకున్నారు. పిల్లల వివాహాలను కూడా ఆదర్శవంతంగా జరిపిన గొప్ప మానవతావాది మలయశ్రీ.
రచనల్లో వైవిధ్యం..
‘నేటి సమాజానికి కావాల్సింది భగవద్గీత కాదు, మానవ గీత’ అని ప్రబోధించిన మలయ శ్రీ సంస్కృతంలో ‘మానవ గీత’ను రచించారు. అశ్వఘోషుని ‘వజ్ర సూచి’ ఉపనిషత్తును తెలుగులోకి అనువదించి సామాన్యులకు అందించారు. జీవితాంతం సామ్యవాదిగా బతికిన ఆయన, కనీసం ‘నమస్కారం’ అనే పదాన్ని కూడా తన దరిచేరనీయకుండా అందరినీ సమానంగా చూసేవారు.
ప్రముఖుల నివాళులు
ఆయన సాహిత్య కృషిని గౌరవిస్తూ వారి పేరు మీద ‘మలయశ్రీ అవార్డు’ను స్థాపించి వంగపండు ప్రసాద రావు, బోయ జంగయ్య వంటి ప్రముఖులను గౌరవించారు. తన భారతీ దేవి గారి మరణం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఇక మలయశ్రీ మరణం పట్ల ప్రముఖ తెలుగు దినపత్రిక ‘దిశ’ ఎడిటర్ దూడం మార్కండేయ, పలువురు సాహితీవేత్తలు, మిత్రులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా, ఆయన రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. వారి కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటూ నివాళులర్పించారు.






