- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: టీచర్ల జీతాలపై రాజకీయ జగడం.. ఆకునూరి మురళి కమిషన్‍పై భగ్గుమన్న ప్రతిపక్షాలు
తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్యాకమిషన్ (Telangana Education Commission) సిఫార్సులపై రచ్చ మొదలైంది. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు (Teacher Salary Controversy) మార్కెట్ ప్రమాణాల కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని, వీటిని సమీక్షించి హేతుబద్ధీకరించాలంటూ కమిషన్ చేసిన సిఫార్సులపై ప్రతిపక్షాలు, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీచర్లకు జీతాలు కాదు.. లీడర్లకు కమిషన్లు కట్ చేయాలి అని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతుండగా, కమిషన్ నివేదికపై బీఆర్ఎస్, బీజేపీలు భగ్గుమంటున్నాయి. ఉపాధ్యాయుల జోలికి వస్తే గుణపాఠం తప్పదని ప్రతిపక్షాలు హెచ్చరించడంతో, రాష్ట్ర రాజకీయాల్లో వేతనాల చర్చ రచ్చగా మారింది.
నివేదికను మూసీలో పారేయండి:
ఉపాధ్యాయుల వేతనాలపై విద్యా కమిషన్ చేసిన సిఫార్సులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కమిషన్ ఇచ్చిన రిపోర్టును తీసుకెళ్లి మూసీలో పారేయాలి, లేదంటే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఉపాధ్యాయుల పట్ల సమాజంలో తప్పుడు అభిప్రాయాలు రేకెత్తించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఈ రిపోర్టు ఇచ్చిన వ్యక్తులకు నైతికత, అవగాహన లేవు. ఇది ఏసీ రూమ్‌లో కూర్చుని రాసి ఇచ్చిన నివేదిక అని విమర్శించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ వర్గం అంతా జాగృతం కావాలని పిలుపునిచ్చారు. డీఏ, పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వాలని, విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలంటూ నివేదిక ఇవ్వాల్సిన కమిషన్.. అందుకు భిన్నంగా రిపోర్టు ఇచ్చిందని ఆరోపించారు. కమిషన్ చైర్మన్‌కు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవని, ఎవరితోనూ మాట్లాడకుండా తప్పుడు నివేదిక ఇచ్చారని దుయ్యబట్టారు. సీఎం ఆదేశం మేరకే ఆకునూరి మురళి ఈ తప్పుడు నివేదిక ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వీపర్ జీతమే లక్షల్లో ఉంటే, టీచర్ల జీతం ఉండొద్దా?:
విద్యాకమిషన్‌లో విద్యావేత్తలేరి?:
విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌లో అసలు విద్యావేత్తలు ఉన్నారా? అని ప్రశ్నించారు. స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో కనీసం పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఒక్కరినైనా కమిటీలో చూపిస్తారా అని నిలదీశారు. ఈ కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్. పైగా ఆయనొక ఇంజినీర్. ఆఫీసులు నడపడం వేరు, చదువులు చెప్పడం వేరు అని విమర్శించారు.
ప్రభుత్వం ఏం చేయబోతోంది?:
డీఏ, పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో విద్యాకమిషన్ ఉపాధ్యాయుల జీతాల అంశాన్ని ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్న వేళ టీచర్ల జీతాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాన్ని ఎటువైపు తీసుకువెళ్లబోతోంది? ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుంది? విద్యా కమిషన్ సిఫార్సులపై ఎలా ముందుకు వెళ్లబోతోంది? అనేది ఉత్కంఠగా మారింది.






