ఫోన్ మాట్లాడేందుకు జంకుతున్న నేతలు.. భయానికి కారణం ఇదే?

by Disha Web Desk 2 |
ఫోన్ మాట్లాడేందుకు జంకుతున్న నేతలు.. భయానికి కారణం ఇదే?
X

హలో.. అన్నా నమస్తే.. నేను రమేశ్‌ను మాట్లాడుతున్న.. మా ఊళ్లో రోడ్డు పని సగమే చేసి ఆపేసిండ్రన్నా.. జెర కంప్లీట్ చేయించవా.. రమేశ్​ బాగున్నవా.. సరే తమ్ముడూ ఓ సారి వాట్సాప్ కాల్ చేయు.. ఫోన్ కట్..! ఇదీ తాజా పరిస్థితి సెగ్మెంట్ లో కార్యకర్తలు, ముఖ్యనేతలు, మీడియా ప్రతినిధులు, తోటి ఎమ్మెల్యేలు ఇలా ఎవరు ఫోన్ చేసినా 'వాట్సాప్ కాల్‌కు రండి.. ఓన్లీ వాట్సాప్'అని చెప్పుకుంటున్నారు. తానేం మాట్లాడుతానో..? వాళ్లు కాల్ రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఇబ్బందుల్లో పడతానేమో అన్న భయం అన్ని పార్టీల నేతలనూ వెంటాడుతున్నది. అధికార పార్టీ నేతల్లో ఈ భయం ఇంకాస్త ఎక్కవగానే ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రధాన పార్టీల నాయకులు ఫోన్‌లో మాట్లాడడానికి జంకుతున్నారు. ఒకరితో మరొకరు మాట్లాడడానికి మొబైల్ ఫోన్ శ్రేయస్కరం కాదనే భావన వారిని వెంటాడుతున్నది. ఏం మాట్లాడాలనుకున్నా వాట్సాప్ ద్వారానే నడిపిస్తున్నారు. పొరపాటున నార్మల్ కాల్ చేసినా 'వాట్సాప్ కాల్‌కు రండి.. ఓన్లీ వాట్సాప్'అని చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ నేతల్లో ఈ భయం మరింత ఎక్కువగా ఉన్నది. ఇందుకు రకరకాల కారణాలను ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గంలోని కింది స్థాయి పార్టీ కార్యకర్తలైనా, తోటి ఎమ్మెల్యేలైనా, మీడియా ప్రతినిధులైనా.. అందరికీ ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలందరూ దీనినే ఫాలో అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాట్సాప్ మాత్రమే సేఫ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నార్మల్ కాల్ చేస్తే ఫోన్ ఎత్తడమే మానేస్తున్నారు. వారి భయపడడానికి కారణాలూ లేకపోలేదు.

ఫోన్ చేస్తున్న వ్యక్తి సంభాషణలను రికార్డు చేసి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తారేమోననేది వారి భయం. పలువురు ఎమ్మెల్యేలు కిందిస్థాయి కార్యకర్తలతో, నియోజకవర్గ ప్రజలతో చేసిన సంభాషణ మొబైల్‌లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ కావడంతో రిస్కులో పడ్డ సందర్భాలు కోకొల్లలు. వీలైనంత వరకు ఓపిగ్గానే మాట్లాడుతూ సంయమనం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి తోడు ఇంటెలిజెన్స్ పోలీసులు ఫోన్లను టాప్ చేస్తారేమోననే అనుమానమూ ఉన్నది. మామూలు కాల్‌లో మాట్లాడినట్లయితే టాపింగ్ జరిగే విషయం కూడా తెలియదని, ఇంటెలిజెన్స్ ద్వారా ఆ మాటలన్నీ పెద్దాయనకు (పార్టీ అధినేత)కు చేరతాయేమోననేది కూడా వారి డౌట్. అనేక అనుభవాలను చూసిన తర్వాత కూడా రిస్కు తీసుకోవడమెందుకనే అభిప్రాయం టీఆర్ఎస్ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నది. కొన్ని సందర్భాల్లో నార్మల్ కాల్‌ వచ్చినా లిఫ్ట్ చేయకుండా కట్ చేసి పక్కన ఉన్న కార్యకర్తల ఫోన్ల నుంచి మాట్లాడుతున్నారు. కనిపించని నిఘా వెంటాడుతున్నదనే అనుమానంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ కారణంగానే చాలా మంది ఎమ్మెల్యేలు యాండ్రాయిడ్ ఫోన్లను మానేసి ఐ-ఫోన్‌లను ఆశ్రయించారు. సెక్యూరిటీపరంగా కాస్త సేఫ్ అని ఫీలవుతున్నారు.

ప్రతిపక్షాలదీ అదేదారి

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలదీ అదే దారి. చాలా కాలంగా విపక్షాల నేతల ఫోన్లను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా టాప్ చేయిస్తున్నదంటూ గతంలో బహిరంగంగానే కామెంట్లు చేశారు. ఇంతకాలం కాంగ్రెస్ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉండడంతో ఆ పార్టీ నేతలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. తెలిసిన వ్యక్తులైతే మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇస్తున్నారు. ఇబ్బందుల్లో పడని సంభాషణలకే పరిమితమవుతున్నారు. కాన్ఫిడెన్షియల్ విషయాలేమైనా ఉంటే పక్కన ఉండే కార్యకర్తల ఫోన్లను వాడుతున్నారు. లేదా వాట్సాప్ కాల్ ద్వారా చర్చించుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలు, మీడియా ప్రతినిధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ లిస్టులో ఉండే అవకాశం ఉందనుకునే వ్యక్తుతో ఫోన్లలో మాటలు బందయ్యాయి. ఇప్పుడు బీజేపీ సైతం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారడంతో ఇలాంటి జాగ్రత్తలకు అలవాటు పడుతున్నారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారే యాక్టివిటీస్ ఇటీవల ఎక్కువయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నార్మల్ కాల్స్ చేస్తే ముందుగానే లీక్ అవుతుందని భయపడుతున్నారు. దీంతో వాట్సాప్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో సంభాషణలు పూర్తై సానుకూల స్పందన వస్తే ఆ తర్వాత ఫామ్ హౌజ్ మీటింగుల్లో ఫైనల్ చేసుకుంటున్నారు.

చాలా మంది రాష్ట్ర స్థాయి పార్టీ నేతలు ఐ-ఫోన్‌లకు అలవాటుపడ్డారు. సొంత పార్టీ నేతలే అయినా ఫోన్లలో జరిగే సంభాషణలు ఎక్కడికి ఎలా చేరుతాయనే భయం చాలా మందిలో ఉన్నది. ఏం మాటలు మాట్లాడితే ఎలాంటి రిస్కులో పడతామోనని జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తే పీఏలు, గన్‌మన్‌ల ఫోన్లను వాడుతున్నారు. ఎమ్మెల్యేలకు నిత్యం నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేసి వారి అవసరాలను చెప్పుకునే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ నంబర్లను పీఏల దగ్గరే ఉంచుతున్నారు. వీలైనంత వరకు వారే పరిష్కారాలను సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఇబ్బంది లేని తీరులో వ్యవహరిస్తున్నారు. పార్టీపట్ల అసంతృప్తిని, నేతలపై ఉండే అభిప్రాయాన్ని పొరపాటున కూడా ఓపెన్‌‌గా డిస్కస్ చేయడంలేదు. మొబైల్ ఫోన్లలో అసలే మాట్లాడడంలేదు. పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలపైనా పెదవి విప్పడంలేదు. పార్టీ మారడం, టికెట్ వస్తుందో రాదో, ఈసారి లోకల్‌గా గెలుపు ఓటములు, ఇబ్బందికర పరిస్థితులు... ఇలాంటి విషయాలు మొబైల్ పోన్లలో చర్చించరాదని చాలామంది నేతలు స్వచ్ఛందంగానే నిషేధం విధించుకున్నారు. టీఆర్ఎస్‌లో ఈ భయాలు ఒక తీరులో ఉంటే కాంగ్రెస్, బీజేపీ నేతల్లో మరో రకంగా ఉన్నాయి. ఏ పార్టీ నేత అయినా ఫోన్‌లో మాట్లాడటమంటేనే రిస్కు అని ఫీలవుతున్నారు.

మునుగోడుపై కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్.. నేడు హైదరాబాద్‌కు కీలక నేత

Next Story