నామినేటెడ్ పద్ధతిలో సహకారం.. 1,200 మందికి రాజకీయ ఉపాధి?

by Malleboina Mahesh |

రాష్ట్రంలో సహకార సంఘాలకు నామినేటెడ్​విధానంలో పాలక మండళ్లను నియమిస్తారనే ప్రచారంతో అధికార పార్టీ నేతలు రాజకీయ లాబీయింగ్​మొదలుపెట్టారు.

నామినేటెడ్ పద్ధతిలో సహకారం.. 1,200 మందికి రాజకీయ ఉపాధి?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సహకార సంఘాలకు నామినేటెడ్​విధానంలో పాలక మండళ్లను నియమిస్తారనే ప్రచారంతో అధికార పార్టీ నేతలు రాజకీయ లాబీయింగ్​మొదలుపెట్టారు. సహకార బ్యాంకులకు ఇకపై ఎన్నికలు ఉండవని తెలుస్తుండగా.. అధికార పార్టీకి సేవలందించే వారికే బ్యాంకుల పగ్గాలు అందనున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేసి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, టెస్కాబ్, డీసీసీబీలు, పీఏసీఎస్​ చైర్మన్ల పదవులు రద్దు చేసిన అధికారులను ఇన్‌చార్జీలుగా ప్రభుత్వం నియమించింది.

డీసీసీబీ చైర్మన్లుగా జిల్లా డీసీసీ అధ్యక్షలు..

మార్కెట్ ​కమిటీల తరహాలో డీసీసీబీ చైర్మన్లను డీసీసీ అధ్యక్షులుగా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. నామినేటెడ్​పదవులు భర్తీ చేస్తే రాజకీయ పరమైన లాభాలు, బ్యాంకుల ద్వారా రైతులకు లబ్ది వంటి అంశాలను ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారు. 904 ప్రాథమిక సహకార సంఘాలు, 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 131 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం 9 జిల్లాలకు బ్యాంకులు ఉండగా, వాటిని 32 జిల్లాలకు విస్తరించేలా ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసింది. దానికి ఎంత సమయం పడుతుంది. ఏర్పాటు చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, రాజకీయ పరంగా ఎంతమందికి లాభం జరుగుతుందనే విషయాలపై అధికార యంత్రాంగంలో చర్చ నడుస్తోంది.

ఏదైనా సంక్రాంతి తర్వాతే..

సంక్రాంతి పండుగ తర్వాత నామినేటెడ్​ పదవులపై క్లారిటీ రానుంది. సహకార బ్యాంకుల పదవులను పార్టీ నేతలకు అప్పగిస్తే సుమారుగా 1,200 మందికి రాజకీయ సహకారం అందుతుందని రాజకీయ వర్గాల్లో టాక్​వినిపిస్తోంది. మరోవైపు రైతు సంఘాలు నామినేటెడ్​భర్తీపై వ్యతిరేకిస్తున్నాయి. వ్యవసాయంపై అవగాహన లేని వారికి బాధ్యతలు అప్పగిస్తే రైతులకు ఆశించిన మేరకు సహకారం అందించలేరని పేర్కొంటున్నారు. పాత విధానంలో ఎన్నికలు నిర్వహించి రైతు శ్రేయస్సు కోసం పాటు పడే వారికే చైర్మన్​పదవి ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నారు.

మంత్రుల చుట్టూ ఆశావహుల చక్కర్లు..

అధికార పార్టీలో ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగేందుకు అవకాశం దొరకని నేతలంతా నామినేటెడ్​పదవుల కోసం పాకులాడుతున్నారు. ఇప్పటికే వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల​ భర్తీ ప్రక్రియ పూర్తయింది.ఈ నెలాఖరులో మరో 15 వరకు నామినేటెడ్​చైర్మన్​నియామకం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు సహకార బ్యాంకులు చైర్మన్లను కూడా నామినేటెడ్​పద్ధతిలో నియామకం చేపడుతారనే ప్రచారంతో ఆశావహులు తమకు పరిచయమున్న మంత్రులు, రాష్ట్ర నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సహకార బ్యాంకుల చైర్మన్​ ఎంపికలో తమ పేర్లు సూచించాలని వేడుకుంటున్నారు. ఇప్పటివరకు వారు పార్టీకి అందించిన సేవలు, అనుభవించిన పదవులు జాబితాను అందజేస్తున్నారు. రాజకీయ జీవితానికి మార్గం చూపాలని ప్రాధేయ పడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇప్పటివరకు తమకు అనుకూలంగా ఉండి, పార్టీకి సేవలందించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

సహకార సంఘాల కమిటీలకు నామినేట్ పదవులు సరికాదు : రైతు సంఘాలు

ప్రాథమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార సంస్థలకు కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేసి పాలకమండల్లను నియమించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను నామినేట్ చేసి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది రాజకీయ నాయకులకు రియల్​ఎస్టేట్​రంగంపై అవగాహన ఉంటుందని, వ్యవసాయ రంగంపై కనీసం పరిజ్ఞానం ఉండదని, వారిని నియమిస్తే రైతులకు సమస్యలు పెరగడం తప్ప పరిష్కారం లభించదని పేర్కొంటున్నారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు నష్టం చేస్తుందని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణల సర్కులర్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు.

Next Story