పోలీసింగ్ సాంకేతికంగా మ‌రింత బ‌ల‌ప‌డాలి : సీఎం రేవంత్ రెడ్డి

by Ratna Kumari |

మారుతున్న నేరాల ధోరణికి అనుగుణంగా పోలీసింగ్ వ్యవస్థ మరింత బలపడాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

పోలీసింగ్ సాంకేతికంగా మ‌రింత బ‌ల‌ప‌డాలి  : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, గండిపేట : మారుతున్న నేరాల ధోరణికి అనుగుణంగా పోలీసింగ్ వ్యవస్థ మరింత బలపడాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గండిపేట మండలం బండ్లగూడ లోని తెలంగాణ పోలీస్ అకాడమీ లో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ పోలీస్ అధికారుల రీట్రీట్–2026 కార్యక్రమం సోమవారం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి “ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ ” అనే అంశంపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత నేరాలు, సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళల భద్రత, ఆర్గనైజ్డ్ క్రైమ్, ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు నిర్వహణ వంటి ఆరు ప్రధాన అంశాలపై సిండికేట్ గ్రూపులు తమ సూచనలు ముఖ్యమంత్రికి సమర్పించాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మారుతున్న నేరాల ధోరణికి అనుగుణంగా పోలీసింగ్ వ్యవస్థ కూడా సాంకేతికంగా మరింత బలపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

రీట్రీట్‌లో వచ్చిన సిఫార్సులను ఈ ఏడాది డిసెంబర్ లోపల అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు చీఫ్ సెక్రటరీ, డీజీపీ తదితరులతో కూడిన కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదలతో పాటు పోలీసింగ్ అవసరాలు మారుతున్నందున పోలీసు సిబ్బంది శక్తిని పునఃపరిశీలించి మండల స్థాయి వరకు మానవ వనరుల అవసరాలను అంచనా వేయాలని సీఎం సూచించారు. అదే సమయంలో పోలీస్ అధికారులు తమ సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. పోలీస్ అకాడమీ కోసం రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను సీఎం ప్రారంభించారు. అలాగే పిల్లల రక్షణ వ్యవస్థ బలోపేతానికి యూనిసెఫ్, పోలీస్ అకాడమీ మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తంగా ఈ రీట్రీట్ ద్వారా సాంకేతికత ఆధారిత, ప్రజాకేంద్రీకృత భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story