భూ భారతిలో పోడు భూములు.. 2.30 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు మేలు

by Ajay Maddhiboyina |

భూ భారతి పోర్టల్‌లో మరో కొత్త మాడ్యూల్ వచ్చేసింది. ఆర్వోఎఫ్ఆర్(రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద పట్టాలు జారీ చేసిన వారి వివరాలు కూడా వెబ్‌సైట్‌లో కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్‌కి పరిష్కారం లభిస్తుంది.

భూ భారతిలో పోడు భూములు.. 2.30 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు మేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : భూ భారతి పోర్టల్‌లో మరో కొత్త మాడ్యూల్ వచ్చేసింది. ఆర్వోఎఫ్ఆర్(రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద పట్టాలు జారీ చేసిన వారి వివరాలు కూడా వెబ్‌సైట్‌లో కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్‌కి పరిష్కారం లభిస్తుంది. ఇన్నాళ్లు పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ, గిరిజన రైతులకు హక్కులు ఉన్నాయని చెప్పుకునేందుకు అధికారికంగా ఏవీ లేవు. కేసీఆర్ హయాం నుంచి పోడు భూముల వివరాలు కూడా ధరణి పోర్టల్‌లో ఉండాలన్న డిమాండ్ ఉంది. ఆయన కూడా పట్టా భూములతోపాటు పోడు భూములకు ప్రత్యేకంగా మాడ్యూల్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ పలు సాంకేతిక కారణాలతో ఇప్పటిదాకా నిలిచిపోయింది. ప్రస్తుతం భూ భారతిలో ఈ మాడ్యూల్‌ని ఏర్పాటు చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 6,69,689 ఎకరాల పోడు భూముల వివరాలు పోర్టల్‌లో కనిపించనున్నాయి. దీని ద్వారా 2,30,735 మంది పోడు రైతులకు మేలు కలుగుతుంది. ఇది విప్లవాత్మకమైన మార్పుగా రెవెన్యూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పంట రుణాలు పొందడానికి ప్రధానంగా వీలు కలుగుతుంది. అలాగే ఈ క్రాప్, క్రాప్ డ్యామేజ్ బెనిఫిట్స్ పొందేందుకు అవకాశం లభిస్తుంది. అనేక సంక్షేమ పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ అధికారిక డేటా ఉపయోగపడుతుంది. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలు తమకూ పంట రుణాలు ఇవ్వాలన్న డిమాండ్‌కి పరిష్కారం లభించనున్నది.

ఎంతో ప్రయోజనం..

ప్రధానంగా మహబూబ్‌నగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్‌కర్నూలు జిల్లాల్లో పోడు పట్టాలు కలిగినవారు ఉన్నారు. వారి వివరాలు కూడా భూ భారతి పోర్టల్‌లో దర్శనమిచ్చే అవకాశం ఉంది. అటవీ భూములకు ప్రత్యేకంగా మాడ్యూల్‌ని రూపొందించాలని కేసీఆర్ హయాం నుంచి చెప్తున్నదే. నేడు వాటి వివరాలను అప్‌లోడ్ చేస్తున్నారు. మామూలుగా పట్టా, అసైన్డ్ ల్యాండ్ హోల్డర్స్ వివరాలు ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే. ల్యాండ్ సెర్చ్‌కి వెళ్లి జిల్లా, డివిజన్, మండలం, గ్రామం ఎంట్రీ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాహోల్డర్స్ డీటెయిల్స్ కూడా అలాగే తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మంగళవారం ఈ మాడ్యూల్‌లో డేటా ఎంట్రీ చేసేందుకు భూ భారతి పోర్టల్‌ని తాత్కాలికంగా నిలిపివేసి ఉండొచ్చనే చర్చ జరిగింది.

తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ఎక్కువ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో పోడు సాగు 3 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేది. 2014 తర్వాత మరో 3.50 లక్షల ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీ చేశారు. దీంతో మొత్తం 6,69,689 ఎకరాల్లో 2,30,735 మంది రైతులు సాగు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికీ పట్టాలు రాలేదని పోరాడుతున్న వారు ఉన్నారు. అక్కడక్కడా ఫారెస్ట్ అధికారులకు, ఆదివాసీలకు మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఫారెస్ట్, ప్రభుత్వ, పట్టా భూముల మధ్య సరిహద్దు వివాదాలు కూడా ఉన్నాయి. ఫారెస్టు భూమిని ప్రభుత్వ భూమిగా భావించి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అసైనీలను దున్నుకోనివ్వకుండా వారిపై ఫారెస్టు అధికారులు కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనేక వివాదాలకు తెరదించితే లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగే చాన్స్ కూడా ఉంది.

ఇన్నేళ్ల జాప్యానికి కారణం..

ఆర్వోఎఫ్ఆర్ చట్టం 2008లో అమల్లోకి వచ్చింది. అయితే రికార్డు ఎవరు మెయింటెయిన్ చేయాలి? ల్యాండ్ ఫారెస్ట్ దైనప్పుడు నిర్వహణ ఆ శాఖ నిర్వహించడం సాధ్యమేనా? ఎవరైనా పట్టాదారుడు చనిపోతే సక్సెషన్ ఎవరు చేయాలి? ఇలాంటి సందేహాలతోనే ఆన్‌లైన్ ప్రక్రియ నిలిచిపోయింది. ధరణి పోర్టల్ అమల్లోకి రాక ముందు వరకు ఫిజికల్ రికార్డు ఆధారంగానే రుణాలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఉంటేనే రుణాలు ఇవ్వడం మొదలైంది. అప్పటి నుంచి పోడు రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. నిజానికి ఆర్వోఎఫ్ఆర్ చట్టం రూల్స్‌లో పోడు పట్టాల డేటాను రెవెన్యూ రికార్డుతో సింక్రనైజ్ చేయడానికి మార్గాలను చూపారు. ఒక రెవెన్యూ విలేజ్ ఆఖరి సర్వే నం.450గా ఉంటే 451 నుంచి పోడు భూముల వివరాలను నమోదు చేయొచ్చని చట్టంలోనే ఉంది. ఈ ఒక్క పని చేయడానికి ఇన్నేళ్లు పట్టింది.

వ్యవసాయ కమిషన్ కృషి..

ఈ మాడ్యూల్ వచ్చి పోడు రైతులకు మేలు కలిగితే ఆ క్రెడిట్ పూర్తిగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌కే దక్కుతుంది. మొదటి నుంచి దీనిపై ప్రభుత్వానికి అనేక సూచనలు చేసింది. ఫారెస్ట్, రెవెన్యూ, ట్రైబల్ వెల్ఫేర్, వ్యవసాయ శాఖల అధికారులతో పలు సమావేశాలను నిర్వహించారు. ధరణికి ముందు పోడు రైతులకు రుణాలు వచ్చాయి. ఇప్పుడు ఆన్‌లైన్ చేయని కారణంగా లక్షలాది మంది ఆదివాసీ, గిరిజన రైతులు అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు కాగితాలు చూసి బ్యాంకర్లు లోన్లు ఇచ్చేవారని కమిషన్ సభ్యుడొకరు ‘దిశ’కు వివరించారు. ధరణి వచ్చిన తర్వాతే ఈ ఇబ్బందులు తలెత్తాయన్నారు. తాము బ్యాంకర్లతో సమావేశమైనప్పుడు భూభారతి ఆధారంగా లోన్లు ఇస్తున్నప్పుడు రికార్డుల్లో లేకుండా ఇచ్చేందుకు అవకాశం లేదని ఎస్ఎల్బీసీ ప్రతినిధులు చెప్పారు.

భూభారతిపై హర్షం..

ఆన్‌లైన్ చేయడానికి ఆర్ఓఎఫ్ఆర్ రూల్స్ అనుకూలంగా ఉన్నాయని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలంటూ కమిషన్ తరఫున పలుమార్లు ఫారెస్టు, ట్రైబల్ వెల్ఫేర్, సీసీఎల్ఏకు లేఖలు రాశారు. ఆ తర్వాత సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితోనూ కమిషన్ చైర్మన్, సభ్యులు పలుమార్లు ఈ సమస్య గురించి చర్చించారు. ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్, రూల్ 12ఎ(9) ప్రకారం డేటాను రెవెన్యూతో సింక్రనైజ్ చేయాలి. అలాగే పోడు భూముల్లో సాగుకు ప్రభుత్వం సాయం అందించాలి. ఎలాగూ ఎన్ఐసీ దగ్గరే భూ భారతి డేటా, పోడు భూముల డేటా ఉంది. ఈ రెండింటిని సింక్రనైజ్ చేయడం పెద్ద కష్టమైన పని కాదని సూచించారు. ఎట్టకేలకు ఆర్వోఎఫ్ఆర్ భూముల డేటా భూ భారతిలో దర్శనమివ్వడం పట్ల వ్యవసాయ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. వ్యవసాయ కమిషన్ గతేడాది ఆగస్టు 20న సంబంధిత శాఖలతో సమావేశమైంది. సెప్టెంబరు 4న ట్రైబల్ వెల్ఫేర్‌కి వ్యవసాయ కమిషన్ లేఖ రాసింది. సీసీఎల్ఏకు అక్టోబరు 9న ట్రైబల్ వెల్ఫేర్ ఈ పోడు భూముల రికార్డుల అప్డేషన్ గురించి లేఖ రాసింది. ఈ కృషితోనే నేడు పోడు రైతుల సమస్య పరిష్కారమైంది.

నాడు..

- ‘‘తెలంగాణలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం. గత ప్రభుత్వాల హయాంలో భూముల వివరాలు తెలిసేది కాదు. ధరణి పోర్టల్‌ ద్వారా ప్రతి ఎకరా భూమి వివరాలను పక్కాగా తెలుసుకోవచ్చు’’ -26 మార్చి, 2021న అసెంబ్లీలో సీఎం కేసీఆర్.

- ‘ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ల్లో రాజకీయ దందా చేశారన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ఇచ్చినవి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా సర్టిఫికెట్లు కావన్నారు. పని చేసుకోవడానికి వీలు కల్పించే పత్రం మాత్రమేనన్నారు. ఆ భూములు పొందిన వారు ఫలసాయంతో బతకాలే తప్ప ఓనర్లు కాదన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ఉన్న వాటిని కూడా ధరణి పోర్టల్‌లో ప్రత్యేకంగా నమోదు చేస్తాం. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం. ఇప్పటికీ దున్నుకుంటున్న వారు పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక దర్బార్‌ పెట్టి ఇప్పుడున్న వరకు పోడు భూములకు పట్టాలు ఇమ్మని చెప్పి క్లోజ్‌ చేస్తాం. భవిష్యత్తులో అవకాశం ఇవ్వబోం. దున్నుకుంటే పోతుంటే అడవి తగ్గిపోతోంది. పర్యావరణం దెబ్బతింటోందన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసేవారికి రక్షణ కల్పిస్తాం’.. - సెప్టెంబరు 12, 2020న అసెంబ్లీలో సీఎం కేసీఆర్.

Next Story