సజ్జనార్ ఎఫెక్ట్.. మైన‌ర్ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్.. రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌పై పొక్సో కేసు న‌మోదు

by Ramesh Naini |

మైన‌ర్ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌పై హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో పొక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు అయింది.

సజ్జనార్ ఎఫెక్ట్.. మైన‌ర్ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్.. రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌పై పొక్సో కేసు న‌మోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైన‌ర్ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌(YouTube channels)పై హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో (POCSO) పొక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు అయింది. ఈ వివరాలను శనివారం ఎక్స్ వేదికగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Sajjanar) తెలిపారు. (Social media) సోష‌ల్‌మీడియాలో స్వేచ్ఛ ఉంది క‌దా అని.. ఏ త‌ర‌హా కంటెంట్ అయినా చేస్తామంటే కుద‌ర‌దని సజ్జనార్ సూచించారు. చ‌ట్ట‌ప్ర‌కారం బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లను పోలీస్ శాఖ తీసుకుంటుందని హెచ్చరించారు.

కాగా, ఇటీవల సజ్జనార్ పోస్ట్ చేసిన వైరల్ వీడియోల ఆధారంగా ఈ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఓ మైనర్ జంట ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో మైనర్ జంట ముద్దు సీన్ చేయడంపై యాంకర్ ప్రశ్నిస్తాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక తప్పేంటీ అన్నట్లుగా ఇంటర్వ్యూలోనే ముద్దు పెడుతుంది. మరో వైపు ఇంకో యూట్యూబ్ ఛానల్ యాంకర్ మైనర్ బాలుడితో ఇంటర్వ్యూ చేస్తాడు. అందులో యాంకర్ వేసే ప్రశ్నలకు ఓ మైనర్ బాలుడి అసభ్యంగా సమాధానాలు చెబుతాడు. ఈ ఇంటర్వ్యూలపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా..? అంటూ యూట్యూబ్ ఛానల్స్‌పై మండిపడుతూ వీడియో పోస్ట్ చేశారు.

వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు అని ట్వీట్‌లో సజ్జనార్ నిలదీశారు. చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమాజాభివృద్ధికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. గుర్తుపెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు.. క్షమార్హం.. చట్టరీత్యా నేరం అని పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ యూట్యూబ్ చానల్స్‌పై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ట్వీట్ ఇదే..

Next Story