ప్రధాని మోడీ బీసీ బిల్లులను ఆమోదించాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Muthe.Rajitha |

దేశ ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్లపైన జోక్యం చేసుకుని బీసీ బిల్లులను ఆమోదించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోడీ బీసీ బిల్లులను ఆమోదించాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ,తెలంగాణ బ్యూరో : దేశ ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్లపైన జోక్యం చేసుకుని బీసీ బిల్లులను ఆమోదించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బీసీల మనోభావాలను, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీసీ బిల్లులకు ఆమోదం తెలిపాలని ఆయన కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై గురువారం లోక్ సభలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో, అసెంబ్లీలో తీర్మాణాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆరు నెలల క్రితమే గవర్నర్ వద్దకు పంపినా ఇప్పటి వరకు ఆయన నిర్ణయం తీసుకోలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ చామల

హ్యాండ్‌లూమ్ సెక్టార్ అంశంపై టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ చామల కీలక సమస్యలను కమిటీ దృష్టికి తీసుకు వచ్చారు. తెలంగాణ హ్యాండ్‌లూమ్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ, పొచంపల్లి ఇకట్, నారాయణపేట వంటి ప్రత్యేకంగా నేసిన వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ టిఎస్కో వంటి సంస్థలు, ముడి సరుకు, మార్కెటింగ్, సంక్షేమ పథకాల ద్వారా స్థిర అభివృద్ధికి మద్దతు ఇస్తున్నాయని, సిరిసిల్ల ప్రధాన హ్యాండ్‌లూమ్ క్లస్టర్‌గా కొనసాగుతోందని ఎంపీ చామల తెలిపారు.

రూ. పదివేలు విలువ చేసే పట్టు చీర, కేవలం రూ. ఆరు వందల ఖర్చుతో డుప్లికేట్‌గా తయారు చేస్తున్నారని, పవర్‌లూమ్ యజమానులు కొన్ని వారాల్లోనే కాపీ చేసి చౌక ధరలకు మార్కెట్లోకి విడుదల చేస్తున్నారని, దీనితో హ్యాండ్‌లూమ్ పట్టు, పత్తి చీరలకు డిమాండ్ భారీగా తగ్గిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వంద కోట్లతో ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు, పొచంపల్లి హ్యాండ్‌లూమ్ చీరలకు తనీఖీ ట్యాగ్ జత చేయడం..దేశవ్యాప్తంగా టీవీ, సోషల్ మీడియా, హోర్డింగ్స్ ద్వారా బ్రాండ్ అంబాసడర్లతో ప్రచార చేయించాలన్నారు. డుప్లికేట్ తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బలమైన వ్యవస్థను అమలు చేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, టెక్స్ టైల్స్ శాఖ రాష్ట్ర మంత్రి పబిత్ర మార్గరెటా తదితరలు పాల్గొన్నారు.

Next Story