ప్లస్ 2 సిస్టమ్‌తో విద్యలో విప్లవం.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్

by Naga Rani Yarlagadda |

ప్రస్తుతం జాతీయ విధ్యావిధానంతో పాటు చాలా రాష్ట్రాల్లో ప్లస్ 2 అమలు అవుతున్నది. సిలబస్ రూపొందించడం, పరీక్షలను నిర్వహించడం ఒకే బోర్డు పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

ప్లస్ 2 సిస్టమ్‌తో విద్యలో విప్లవం.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అమలవుతోన్న విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్‌ను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ప్లస్ 2 విధానం అమలు చేస్తే ఎలా ఉంటుందో అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతోన్న విద్యావిధానం పద్ధతులను పరిశీలించి, ఓ నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇంటర్ తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకని ప్లస్ 2ను అమలు చేద్దామనే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

చాలా రాష్ట్రాల్లో ప్లస్ 2 సిస్టమ్

ప్రస్తుతం జాతీయ విధ్యావిధానంతో పాటు చాలా రాష్ట్రాల్లో ప్లస్ 2 అమలు అవుతున్నది. సిలబస్ రూపొందించడం, పరీక్షలను నిర్వహించడం ఒకే బోర్డు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్‌కు ఒకే బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రావడం లేదు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్ రెండు రకాలైన సర్టిఫికెట్స్ ఉండటం వల్ల కొన్ని సార్లు విదేశాల్లో ఇబ్బందులు వస్తున్నట్లు ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీనితో రాష్ట్రంలో కూడా ప్లస్ 2 సిస్టమ్ అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించినట్లు తెలుస్తున్నది. అందుకోసం మిగతా రాష్ట్రాల్లో ప్లస్ 2 విధానం అమలు వలన కలిగే లాభనష్టాలను ఆధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.

పది పాసైన విద్యార్థులు ఇంటర్‌‌లో చేరట్లే..

గ్రామీణ ప్రాంతాల్లోని హైస్కూల్స్‌లో టెన్త్ పాస్ అయిన స్టూడెంట్స్‌లో సుమారు 20 శాతం మంది పై చదవులకు వెళ్లడం లేదు. ప్రధానంగా బాలికలను తల్లిదండ్రులు ఇంటర్‌లో జాయిన్ చేయించడం లేదు. ఎందుకంటే ఇంటర్ కాలేజీలు టౌన్స్‌లో ఉండటమో, లేకపోతే తమ గ్రామాలకు దూరంగా ఉండటమో ప్రధాన కారణమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో బాలికల హయ్యర్ ఎడ్యుకేషన్ స్థాయి క్రమంగా తగ్గిపోతుందని విద్యావేత్తలు అందోళన చెందుతున్నారు. అందుకని టెన్త్ తరువాత ప్లస్ 2 అందుబాటులోకి వస్తే పిల్లలకు చదువు మానేసే అవకాశం ఉండదని, ప్లస్ 2 తరువాత పిల్లల్లో ఆలోచన శక్తి పెరిగి, డిగ్రీ చదువులకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతారని అభిప్రాయాలు ఉన్నాయి.

కస్తూర్బా, గురుకులాల్లో ఇంటర్ వరకు బోధన

ప్రస్తుతం రాష్ట్రంలో మెజార్టీ కస్తూర్బా పాఠశాలలు, గురుకులాల్లో ఇంటర్ వరకు బోధన కొనసాగుతున్నది. దీంతో పది పాస్ అయిన పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడే 12 వరకు చదువుతున్నారు. దీనితో తమ పిల్లల చదువును తల్లిదండ్రులు మధ్యలో ఆపేయడం లేదు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్లస్ 2 విధానం అమలు చేస్తే బాగుంటుదని సీఎం రేవంత్ అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో సైతం 12 వరకు చదువు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది.

లెక్చరర్ల సర్వీసుకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు

టెన్త్, ఇంటర్‌ను ఒకే గొడుకు కిందికు తీసుకురావడం వల్ల జూనియర్ లెక్చరర్లు ఆందోళన చెందే అవకాశం ఉందని చర్చ సమావేశంలో ప్రస్తావనకు రాగా.. వాళ్ల సర్వీస్, ప్రమోషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తున్నది. ప్లస్ 2 విధానం అమలు చేయడం వల్ల రాష్ట్రంలో ఇంటర్ బోధిస్తున్న కార్పొరేట్ కాలేజీల దోపిడికి చెక్ పెట్టొచ్చని అభిప్రాయాలు విద్యావేత్తల్లో ఉన్నాయి. ఒక్కో కాలేజీ గరిష్టంగా ఏడాదికి రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఫీజులను వసూలు చేస్తున్నాయి.

Next Story