ఖరీఫ్ సీజన్​కు పుష్కలంగా విద్యుత్

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్​కు విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు.

ఖరీఫ్ సీజన్​కు పుష్కలంగా విద్యుత్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్​కు విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ వర్షా కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నందున విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ అధికారులతో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్​రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క లు విద్యుత్ శాఖ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా పై నిరంతర పర్యవేక్షిస్తు వస్తున్నారని తెలిపారు. రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం లో పారిశ్రామిక, వాణిజ్య రంగాలతో పాటు గృహా విద్యుత్​కు కూడా భారీ వినియోగం నమోదవుతోందన్నారు. దీనికి తోడు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండటంతో లక్షలాది మోటర్లు నిరంతరం నడుస్తున్నాయని ఫలితంగా వర్షాల సీజన్ లో కూడా భారీగా డిమాండ్ నమోదవుతోందని

నవీన్ మిట్టల్ తెలిపారు. గతేడాది 2024 జులై 31 న 13,541 మెగావాట్లుగా గరిష్ట విద్యుత్​డిమాండ్ నమోదు కాగా, అది ఈ ఏడాది జులై 16 న 14.05 శాతం పెరుగుదలతో 15,443 మెగావాట్లుగా నమోదయ్యిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతుండటంతో నీటి లభ్యత బాగా పెరిగిందని, వరి నాట్లు జోరందుకోవడంతో రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సీఎండీ స్థాయి నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంతరాలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని నవీన్​మిట్టల్​ఆదేశించారు.

ముఖ్యంగా ఈ వర్షాల సీజన్ లో అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ వర్షాలు కురిసేటప్పుడు తప్పనిసరిగా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ సరఫరా పర్యవేక్షించాలని నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో టీజీఎస్​పీడీసీఎల్​ డైరెక్టర్లు డా. నర్సింహులు, చక్రపాణి, కృష్ణా రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Next Story