New Ration cards: ఫిజికల్ రేషన్ కార్డులు ఇప్పుడే కాదు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-07-14 08:58:59  IST  )

కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Ration cards: ఫిజికల్ రేషన్ కార్డులు ఇప్పుడే కాదు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నూతన రేషన్ కార్డుల (New Ration Cards) పంపిణీ సందర్భంగా లబ్దిదారులకు రేషన్ కార్డు నంబర్ తో పాటు వారి కుటుంబ వివరాలను లబ్ధిదారుల జాబితాలో చేర్చబోతున్నట్లు చెప్పారు. వీరందరికి వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం అందుతుందని చెప్పారు. రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రింటింగ్ దశలో ఉందని అది పూర్తయ్యాక ఫిజికల్ గా కార్డులను పంపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డు మోడల్ పైనల్ అయిందన్నారు. దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి మూడు రంగలుతో కూడిన కార్డు, దారిద్రరేఖకు ఎగువన ఉన్నవారికి గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక మార్పు:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక మార్పు తెచ్చి ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తే అక్కడ మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సూర్యాపేట జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా అదనంగా 95 లక్షలు ఇవ్వబోతున్నామని చెప్పారు. కొత్త పాత కార్డులతో మొత్తం రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 10 లక్షలకు చేరుతుందన్నారు. ఏడాదికి రూ. 13 వేల కోట్ల వ్యయంతో ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో నాణ్యమైన సన్నబియ్యం, అర్హురాలైనవారికి రేషన్ కార్డులు అందించడం దేశంలో తెలంగాణలోనే ప్రథమం అని ఇంతకంటే గొప్ప సంక్షేమ పథకం ఎక్కడా ఉండదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ బియ్యం ప్రజలు తినేవారు కాదన్నారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ గేమ్ చేంజర్ అన్నారు. ఇంత సార్థకత ఉన్న ఈ కార్యక్రమంపై రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

Next Story