- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు
రాష్ట్రంలో సంచలన సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు ఆ నోటీసులో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పబ్లిక్‌లో తనపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవి ఉన్న బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో ఓ ప్రజాప్రతినిధిగా తనపై ఇలా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. రాజకీయ ఉనికి కోసమే తనపై బండి సంజయ్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చేసిన ఆరోపణలకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని.. భవిష్యత్తులో అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని కేటీఆర్, బండి సంజయ్‌కి ఇచ్చిన లీగల్ నోటీసుల్లో న్యాయవాదులు పేర్కొన్నారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా డిమాండ్లను పాటించని పక్షంలో చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణలతో కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులలో ప్రస్తావించారు.
కాగా, ఆగస్టు 8న దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సిట్ విచారణకు హాజరై బయటకు వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్లు ట్యాప్ అయిన వారి జాబితాలో రేవంత్ రెడ్డితో పాటు హరీశ్ రావు పేర్లు కూడా ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తన ఫోన్ ఎక్కువగా కేటీఆర్ ట్యాప్ చేశారని ఆరోపించారు. సిట్ అధికారులు ట్యాపింగ్‌కు సంబంధించి చూపించిన వివరాలు చూసి తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. మావోయిస్టుల జాబితాలో మా పేర్లు పెట్టి ట్యాపింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను.. అప్పట్లోనే చెప్పానని అన్నారు. వావి వరుసలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. చివరికి తన ఇంట్లో సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేయడం దారుణమని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఫోన్లను కూడా విపరీతంగా ట్యాప్ చేయించారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన చుట్టూ కేటీఆర్ నిఘా పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో చివరికి సామాన్యుల కూడా ఫోన్లు మాట్లాడలేకపోయారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.






