ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు

by Muthe.Rajitha |

రాష్ట్రానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 75 పీజీ సీట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు మెరుగుపడడంతో 7 కాలేజీల్లో పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మెడికల్ కాలేజీల్లోనూ పీజీ సీట్ల పెంపుతో వైద్య విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లుగా ఎన్ఎంసీ స్పష్టం చేసింది. నల్గొండ 19, రామగుండం 16, సూర్యాపేట 16, సిద్దిపేట 8, మహబూబ్‌‌ నగర్ 4, నిజామాబాద్ 4, ఉస్మానియా మెడికల్ కాలేజీ 4 సీట్లు (మొత్తం 75 సీట్లు) కేటాయిస్తూ ఎన్ఎంసీ ఆదేశాలిచ్చిందని డీఎంఈ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

పీజీ సీట్ల పెంపుతో మెరుగైన వైద్యం...

తాజాగా పీజీ సీట్ల పెంపుతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు 1191 ఉంటే పెరిగిన సీట్లతో కలిపి 1266 కానుంది. కాగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య 1789. మొత్తంగా 3055 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం పెంచిన 75 సీట్లతో పీజీ వైద్య విద్య మరింత బలోపేతం అవుతుంది.

స్పెషాలిటీ వైద్యం రెండో స్థాయి నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలకు సైతం విస్తరిస్తుంది. రేడియాలజీ, అనస్తీషియా, రెస్పిరేటరీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ వంటి ముఖ్యమైన డిపార్ట్ మెంట్లలో సీట్ల పెంపుతో మారుమూల గ్రామాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్యానికి హైదరాబాద్ తరలిరావాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.

సీట్ల పెంపుతో ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తగ్గుతుంది. ఎంబీబీఎస్ చేసి ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పీజీ చేసేందుకు ప్రయాసపడాల్సిన పరిస్థితులు కొంతమేరైనా తగ్గుతాయి. మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో పీజీ సీట్లు రావడం వల్ల నామమాత్రపు ఫీజులో పీజీ వైద్య విద్య పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పేద విద్యార్థులకు ఇదో వరంగా భావించవచ్చు.

Next Story