- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్మిషన్ ఒకటి.. ప్లాన్ మరోటి! పటేల్ చెరువు వద్ద లోటస్ ప్రాజెక్ట్ వివాదం
మియాపూర్ పటేల్ చెరువు బఫర్ జోన్‌లో ‘లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్’ చేపట్టిన అక్రమ నిర్మాణాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మియాపూర్ పటేల్ చెరువు బఫర్ జోన్‌లో ‘లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్’ చేపట్టిన అక్రమ నిర్మాణాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రాజెక్ట్ అనుమతి పత్రాలు, బిల్డర్ సమర్పించిన ప్లాన్ ను నిశితంగా పరిశీలిస్తే.. చట్టాలను, మున్సిపల్ అధికారులను బిల్డర్ ఎంత పక్కాగా మోసం చేశాడో, దానికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ స్థాయిలో సహకరించారో స్పష్టమవుతున్నది. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న పటేల్ చెరువును మాయం చేసి, దాన్ని ప్రైవేట్ ల్యాండ్‌గా క్రియేట్ చేసిన విషయం వెల్లడైంది. ఇరిగేషన్ శాఖ రికార్డుల ప్రకారం ఈ స్థలానికి కుడివైపున పటేల్ చెరువు కట్ట స్పష్టంగా ఉంది. దానికి కనీసం 10 మీ. నుంచి 17 మీటర్ల మేర నిషేధిత బఫర్ జోన్ వదలాల్సి ఉంది. కానీ బిల్డర్ సమర్పించిన డ్రాయింగ్ ప్లాన్‌లో.. ఎక్కడా కూడా పటేల్ చెరువు అని కానీ, ఇరిగేషన్ బఫర్ జోన్ అని రాయనేలేదు. ఆ స్థలానికి కుడివైపున కేవలం పొరుగువారి స్థలం అని రాసి ఉంచారు. ఒక ప్రభుత్వ రక్షిత చెరువును, నిషేధిత బఫర్ జోన్‌ను ప్లాన్ నుంచి పూర్తిగా తుడిచేసి దాన్ని ఓ సాధారణ ప్రైవేట్ ల్యాండ్‌గా చూపించడం ద్వారా అధికారుల కళ్లుగప్పారు. తద్వారా ఆ సరిహద్దుకు ఆనుకుని ఎలాంటి సెట్‌బ్యాక్స్ లేకుండా ఐదంతస్తులు, ఆరు అంతస్తుల భవనాలను ఈజీగా డిజైన్ చేసి చట్టాలను ఈజీగా చుట్టేశారు.
కళ్లు మూసుకుని పర్మిషన్!
జీహెచ్ఎంసీ జారీచేసిన బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్ ను చూస్తే అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. ఈ అనుమతి ఒక సెల్లార్, గ్రౌండ్, ఐదు అంతస్తులకు మాత్రమే ఇస్తున్నట్టు సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్ సంతకంతో ఆర్డర్ పాస్ అయింది. కానీ, దానికి జతచేసి ఆమోదముద్ర వేసిన ప్లాన్ డ్రాయింగ్స్ ను పరిశీలిస్తే అందులో ఏకంగా సెల్లార్లు, గ్రౌండ్, ఆరు అంతస్తులు నిర్మించేలా పక్కాగా డిజైన్ చేసి ఉంది. అనుమతి ఇచ్చిన పత్రంలో ఒకలా రాసి, దానికి జతచేసిన బ్లూప్రింట్‌లో అదనంగా ఒక సెల్లార్‌ను, అలాగే పైన మరో అదనపు అంతస్తును కలిపి నిర్మించేలా స్కెచ్ వేసినా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గుడ్డిగా నమ్మి స్టాంప్ వేసి సంతకం చేశారు. సాధారణంగా ఇలాంటి బహుళ అంతస్తుల ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చే ముందు టౌన్ ప్లానింగ్ అధికారులు స్వయంగా వచ్చి స్థలాన్ని పరిశీలించాలి. పక్కనే చెరువు కట్ట అంత పెద్దగా కనిపిస్తున్నా.. ప్లాన్‌లో దాన్ని ప్రైవేట్ భూమి అని రాసినా కూడా అధికారులు కళ్లు మూసుకుని అప్రూవల్ స్టాంప్ వేశారంటే.. దీని వెనుక ఎంతటి అవినీతి బాగోతం నడిచిందో అర్థమవుతున్నది.
కస్టమర్లకు బురిడీ
పొందిన అనుమతులు, అప్రూవల్ అయిన ప్లాన్లకు విరుద్ధంగా లోటస్ నిర్మాణం జరిగిందనే విషయం అర్థమవుతున్నది. అయితే అపార్ట్‌మెంట్ ప్లాట్లను అమ్ముకునేందుకు లోటస్ ఇన్ ఫ్రా యాజమాన్యం తప్పుడు విధంగా మరొక అడుగు ముందుకు వేసి అమ్మకాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొనుగోళ్ల కోసం వెళ్లిన కస్టమర్లకు ఇస్తున్న బ్రోచర్ లో అపార్ట్ మెంట్స్ వెనక వైపు స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు చూపించారు. అయితే అప్రూవ్డ్ ప్లాన్ లో ఆ విధంగా స్విమ్మింగ్ పూల్ లేనేలేదు. మరి నిబంధనలకు విరుద్ధంగా స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తారా? అనే ప్రశ్నలు ఉన్నాయి.
వాస్తవాలను దాచిపెట్టి
జీహెచ్ఎంసీ బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్ కాపీ లోని 2వ నిబంధన ప్రకారం.. తప్పుడు సమాచారం లేదా వాస్తవాలను దాచడం ద్వారా పర్మిషన్ పొందితే ఈ అనుమతిని రద్దు చేసే హక్కు జీహెచ్ఎంసీకి ఉంది. ఇక్కడ చెరువు ఉనికిని దాచి నైబర్స్ ల్యాండ్ అని రాయడం, ఇరిగేషన్ బఫర్ కటింగ్‌ను మాయం చేయడం, ఐదు ఫ్లోర్ల ఆర్డర్ ఇచ్చి ప్లాన్‌లో ఆరు ఫ్లోర్లకు అప్రూవల్ కొట్టేయడం.. ఇవన్నీ ముమ్మాటికీ వాస్తవాలను దాచడం కిందకే వస్తాయని పలువురు ఆరోపిస్తున్నారు. మరి ఈ నియమం ప్రకారం లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అనుమతిని వెంటనే ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీస్తున్నారు.
కొనుగోలుదారులకు నష్టమే
బిల్డింగ్ పర్మిషన్ కాగితాల ప్రకారం ఐదు అంతస్తులకే ఉన్నప్పుడు, అప్రూవల్ ప్లాన్‌లో ఆరు అంతస్తులు వేసి సెల్లార్లుగా ఉంది. ఆ భవనానికి మున్ముందు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదు. ఓసీ రాకపోతే సుప్రీంకోర్టు తాజా నిబంధనల ప్రకారం ఎలాంటి విద్యుత్, మంచినీటి కనెక్షన్లు ఇవ్వకూడదు. అమాయక కొనుగోలుదారులను అంధకారంలోకి నెడుతూ చెరువును మాయం చేసిన ఈ లోటస్ లీలలపై ఉన్నత స్థాయి కమిటీతో లేదా విజిలెన్స్ విభాగంతో సమగ్ర విచారణ జరిపి, అక్రమ ప్లాన్‌ను సహకరించిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Sales బ్రౌచర్ లో నిర్మాణం పక్కన చెరువు ఉన్నదని చూపించారు.. కానీ అప్రూవ్డ్ ప్లాన్ లో నైబర్స్ ల్యాండ్ గా చూపించారు.
Approved plan లో చెరువు ఉండాల్సిన చోట నైబర్స్ ప్రాపర్టీ అని ఉన్న దృశ్యం






