- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రద్దుకు సిద్ధం.. సీఎంతో దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి
సాయుధ పోరాటం విరమించి మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మార్చేందుకు సిద్ధమని అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఒకవైపు.. ఇటీవలి కాలం వరకు తుపాకులతో పోరాడిన మావోయిస్టు అగ్రనేతలు మరోవైపు. ఇరువురి చరిత్రాత్మక కలయకకు సచివాలయం వేదికైంది. డీజీపీ మొదలు పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో దాదాపు గంట పాటు వీరి మధ్య అనేక ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తమ అంతరంగాన్ని ఆవిష్కరించగా, తన పరిధిలోని అంశాలను తప్పకుండా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నాలుగున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉండి పోరాటం చేసిన మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇంచార్జ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (జగన్), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్నలు ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. వీరితో పాటు గతంలో లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని కూడా రద్దు చేస్తాం..
ఈ సందర్భంగా వారు కీలకాంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే సాయుధ పోరాటాన్ని విరమిస్తామని దేవ్ జీ, రాజిరెడ్డిలు తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)ని కూడా రద్దు చేస్తామని, ప్రజా జీవితంలోనే చట్టపరంగా ఉద్యమ పంథా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము రాజకీయంగా పురోగమించేందుకు ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్రం సహకరిస్తే మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మారుస్తామన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని, ఒకవేళ ఆయన అంగీకరిస్తే ఇక్కడే సభ ఏర్పాటు చేసి ప్రకటిస్తామని అన్నారు. ఆ విషయం తమ పరిధిలో లేనందున ఇప్పుడే హామీ ఇవ్వలేకపోతున్నానని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా, లొంగిపోయిన మావోయిస్టులకు 30 ఏళ్ల క్రితం ప్రకటించిన రివార్డులే ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో రివార్డు సొమ్ము ఎక్కువగా ఉందని అగ్రనేతలు సీఎం దృష్టికి తెచ్చారు. వీరికి ఆరోగ్యశ్రీని తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం, ఇతర రాష్ట్రాల్లోని రివార్డుల గురించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. అయితే వ్యవసాయ భూమి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఇతర అంశాల గురించి కేబినెట్ భేటీలో చర్చించి వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
లొంగిపోయిన వారి భద్రతకు లోటు రావొద్దు: సీఎం
జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయం తీసుకున్న మావోయిస్టు నేతలను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎలాంటి సమస్యకైనా హింస పరిష్కారం కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు. లొంగిపోయిన వారికి అవసరమైన భద్రత కల్పించే విషయంలో ఎలాంటి లోటు రాకూడదని అధికారులను ఆదేశించారు. భద్రత, పునరావాస కల్పనలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






