మా గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలిపేయండి.. ఆ రెండు మండలాల ప్రజల డిమాండ్

by Javid Pasha |

మా గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలిపేయండి.. ఆ రెండు మండలాల ప్రజల డిమాండ్

మా గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలిపేయండి.. ఆ రెండు మండలాల ప్రజల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరిట చేపట్టిన ప్రాజెక్టుకు విశేష స్పందన లభిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 56 గ్రామాలతో ఏర్పడిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మరింతగా విస్తరించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఇప్పటికే 765 చ.కి.మీ. విస్తీర్ణంతో ఏర్పాటైంది. అది 1000 చ.కి.మీ. లకు చేరే అవకాశం కనబడుతున్నది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు మండలాల్లో మిగిలిన గ్రామాలను కూడా ఈ ప్రాజెక్టులో చేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారి గ్రామాలకు ఏ ప్రజాప్రతినిధి వచ్చినా మొదట తమ గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపేయాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​బాబు దృష్టికి పలువురు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లు తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు ఈ విషయంపై దృష్టి పెట్టారు. ప్రజల డిమాండ్ అనుగుణంగా నిర్ణయం తీసుకునే విధంగా సీఎంతో చర్చిస్తానని ప్రజాప్రతినిధులకు హామీ ఇస్తున్నారు.

మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

ప్రధానంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా మంత్రి శ్రీధర్​బాబును తెలంగాణ రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కలిశారు. ఫ్యూచర్ సిటీపై ప్రజల ఆకాంక్షలు పెరిగాయని, తమ గ్రామాలను అందులో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నట్టు వివరించారు. తాము గ్రామాలకు వెళ్లగానే ఇదే రిక్వెస్టులు వస్తున్నాయన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని మంత్రి శ్రీధర్​బాబు వారికి చెప్పారు. ఫ్యూచర్ సిటీ జీవో సవరణతో పాటు మహేశ్వరం, కందుకూరు మండలాల్లో మిగిలిన అన్ని గ్రామాలను కలిపే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడిందన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రజాప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

మిగతా మండలాల్లోనూ సానుకూలత

ప్రస్తుతం మహేశ్వరం, కందుకూరు మండలాలకే పరిమితమైన డిమాండ్ త్వరలోనే మరింతగా విస్తరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పట్టాలెక్కి కొన్ని పనులు పూర్తయితే చాలు.. మరింత డిమాండ్ ఊపందుకోనున్నదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాచారం, మంచాల, కడ్తాల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు మండలాల్లో చాలా గ్రామాలు ఫ్యూచర్ సిటీకి వెలుపల ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలు కూడా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో ఉంటే అభివృద్ధి స్పీడ్ గా జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నింటి కంటే వారి భూముల ధరలు రెట్టింపయ్యే చాన్స్ లేకపోలేదు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్న గ్రామాల్లో బడా కంపెనీలు వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారు. త్వరలోనే వారి ప్రాజెక్టులను తెర మీదికి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ప్రస్తావన రాగానే ధరలు పెంచారు. గతంలో ఫార్మా సిటీ ప్రాజెక్టుతో కాలుష్యం వెదజల్లుతుందన్న భయం ఉండేది. ఇప్పుడది క్రమంగా తెర మరుగవుతున్నది. అందుకే ఫ్యూచర్ సిటీపై జనం సానుకూలంగా ఉన్నారు. ఇప్పటికే దీని పక్కనున్న గ్రామాల్లో హెచ్ఎండీఏ లే అవుట్లు, విల్లా ప్రాజెక్టులు అనేకం కొలువుదీరాయి. ఇక రానున్న రోజుల్లోనూ మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫ్యూచర్ సిటీలోని గ్రామాలు

మహేశ్వరం : మెహబ్బతినగర్, తుమ్మలూరు. మంచాల : ఆగపల్లి, నోముల, మల్లిఖార్జునగూడ, చౌదరిపల్లి, గున్ గల్, కొత్తపల్లి, కుర్మిద్ద, మేడిపల్లి, మల్కాజిగూడ, మొగులవంపు, నక్కర్త, నానక్ నగర్, నందివనపర్తి, నజ్దిక్ సింగ్, తక్కెళ్లపల్లి, తాడిపర్తి, తులెకుర్దు, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి. కందుకూరు: దాసర్లపల్లి, అన్నోజిగూడ, దెబ్బడగూడ, గూడూరు, గుమ్మడవెల్లి, కందుకూరు, కొత్తూరు, గఫూర్ నగర్, లేమూరు, మాదాపూర్, మీర్ ఖాన్ పేట, మహ్మద్ నగర్, ముచ్చర్ల, పంజాగూడ, రాచలూరు, సర్వరావులపల్లి, తిమ్మాయిపల్లి, తిమ్మాపూర్. కడ్తాల: చెరికొండపల్లి కల్వకుర్తి, చెరుకొండపట్టి పడకల్, ఎక్రాజ్ గూడ, కడ్తాల, కర్కలపహడ్, ముద్విన్ ఇబ్రహీంపట్నం: కంపాపహడ్, పోచారం, రామిరెడ్డిగూడ, తూలేకలాన్, తుర్కగూడ, వెలిమినేడు, ఎర్రకుంట, తడ్లకాల్వ. ఆమనగల్లు : కోనాపూర్, రామనుంతల.

Next Story