గ‌జం స్థ‌లం క‌బ్జా అయినా ఊరుకోని నగర ప్రజలు.. ఎప్పటికప్పుడే హైడ్రాకు కంప్లైంట్

by Gantepaka Srikanth |

ప్ర‌భుత్వ భూములు కాపాడాలంటూ హైడ్రా ప్ర‌జావాణికి విజ్ఞ‌ప్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌భుత్వ భూమికి సంబంధించి గ‌జం స్థ‌లం క‌బ్జా అవుతున్నా న‌గ‌ర ప్ర‌జ‌లు ఊరుకోడం లేదు.

గ‌జం స్థ‌లం క‌బ్జా అయినా ఊరుకోని నగర ప్రజలు.. ఎప్పటికప్పుడే హైడ్రాకు కంప్లైంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్ర‌భుత్వ భూములు కాపాడాలంటూ హైడ్రా ప్ర‌జావాణికి విజ్ఞ‌ప్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌భుత్వ భూమికి సంబంధించి గ‌జం స్థ‌లం క‌బ్జా అవుతున్నా న‌గ‌ర ప్ర‌జ‌లు ఊరుకోడం లేదు. గ‌తంలో మ‌న‌కెందుకులే అనుకునేవాళ్ల‌మ‌ని.. ఇప్పుడు హైడ్రాకు ఫిర్యాదు చేస్తే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటార‌నే న‌మ్మ‌కంతో తామంతా వ‌చ్చి ఫిర్యాదు చేస్తున్నామ‌ని ప‌లువురు సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో తెలిపారు. ప్ర‌భుత్వ భూములను ప‌రిర‌క్షించ‌డంలో హైడ్రా చూపుతున్న చొర‌వ‌ను చూసి తాము ఫిర్యాదు చేస్తున్నామ‌న్నారు. క‌బ్జాదారులు ఎంత‌టివారైనా వ‌దిలిపెట్ట‌కుండా ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డాన్ని అభినందిస్తూనే మా ప్రాంతాల్లో కూడా చెరువులు, ప్ర‌భుత్వ భూములు, పార్కులు, నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురౌతున్నాయ‌ని.. వాటిని కాపాడాల‌ని ప‌లువురు హైడ్రాను విజ్ఞ‌ప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంప‌ల్లి మండ‌లం గోప‌న్న‌ప‌ల్లి విలేజ్‌లోని 100 అడుగుల ర‌హ‌దారికి ఆనుకుని రెండు రోడ్డులు క‌లిసే చోట ఉన్న ప్ర‌భుత్వ భూమిలో రేకుల ప్ర‌హ‌రీ వేసి లోప‌ల నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని అక్క‌డి స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప‌రిధిలోని ఐడీపీఎల్ కాల‌నీ నుంచి జ‌గ‌ద్గిరిగుట్ట‌కు వెళ్లే మార్గంలో నాలాల‌పై నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని.. వ‌ర్షాకాలం వ‌ర‌ద ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం లేకుండా వెంట‌నే ఆపాల‌ని ప్ర‌జావాణిలో కోరారు. కీస‌ర మండ‌లంలోని నాగారం విలేజ్‌లో స‌ర్వే నంబ‌రు 291/3ల‌ఓ మొత్తం 2.30 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఉప్ప‌ల్ మండ‌లంలోని మ‌ల్లాపూర్ గ్రామం స‌ర్వే నంబ‌రు 84లో దాదాపు 2 వేల గ‌జాల స్థ‌లం ప్ర‌భుత్వానిది కాగా.. ఇందులో నిర్మాణాల‌కు సిద్ధ‌మౌతున్నార‌ని వెంట‌నే కాపాడాల‌ని కోరారు. కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల రామారం జ‌గద్గిరిగుట్ట ప్రాంతంలో ఆల‌యాల పేరిట వ్యాపార స‌ముదాయాలు నిర్మించి అద్దెలు ఇచ్చి రూ. ల‌క్ష‌లు కాజేస్తున్నార‌ని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. కీస‌ర మండ‌లం నాగారం విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 83లో 18 ఎక‌రాల మేర ఉన్న పాత లేఔట్‌ను చెరిపేసి 80 గ‌జాల చొప్పున నోట‌రీమీద స్థ‌లాలు అమ్ముకుంటున్నార‌ని.. పాత లే ఔట్ ప్ర‌కారం పార్కులు, ర‌హ‌దారులు కాపాడాల‌ని ప్లాట్ల య‌జ‌మానులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండ‌లం బ‌డంగ్ పేట గ్రామంలో మ‌ల్ల‌ప్ప‌గారి కుంట దాదాపు 14 ఎక‌రాలుంటుంద‌ని.. మొత్తం చెరువు స్వ‌రూపాన్ని మార్చేసి ప్లాట్లుగా విక్ర‌యిస్తున్నార‌ని ఫిర్యాదులో స్థానికులు పేర్కొన్నారు. పెద్దఅంబ‌ర్‌పేట‌లోని కుంట్లూరు విలేజ్లో ప్ర‌జ‌య్ గుల్‌మ‌హ‌ర్ కాల‌నీ గేటెడ్ క‌మ్యూనిటీ కాక‌పోయినా ర‌హ‌దారుల‌కు అడ్డంగా ప్ర‌హ‌రీలు నిర్మించి ప‌క్క‌నే ఉన్న కాల‌నీల‌కు దారి లేకుండా చేస్తున్నార‌ని అక్క‌డి స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 56 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ ప‌రిశీలించారు. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుని ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత అధికారులను క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

ఎంఎంసీలో 24 ఫిర్యాదులు..

ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, వినతులను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు కూడా పాల్గొని సమస్యలను పరిశీలించారు. 24 వినతిపత్రాలు అందగా, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి తక్షణ పరిష్కారం కోసం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని, వాటి పరిష్కారం వరకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు.

సీఎంసీలో 72 ఫిర్యాదులు..

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి పౌరుల నుండి విశేష స్పందన లభించింది. పౌరులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, మొత్తం 72 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎక్కువగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలనీ అధికారులను కమిషనర్ సృజన ఆదేశించారు.

జీహెచ్ఎంసీలో 55 ఫిర్యాదులు..

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 55 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. హెడ్ ఆఫీస్‌లో 36 ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత విభాగాలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Next Story