PCC chief : సీబీఐ విచారణ తప్పించుకోవడానికే మోడీతో బీఆర్ఎస్ కాళ్ల బేరం: మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |

కేటీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

PCC chief : సీబీఐ విచారణ తప్పించుకోవడానికే మోడీతో బీఆర్ఎస్ కాళ్ల బేరం: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం (Kaleswaram) విషయంలో సీబీఐ (CBI) విచారణ తప్పించుకోవడానికే మోడీ కాళ్లకు మడుగులు ఒత్తుతూ బీఆర్ఎస్ ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కేటీఆర్ తన స్థాయి మరిచి రాహుల్ గాంధీపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మీ స్థాయి ఏంది? మీ కుటుంబ స్థాయి ఏంది అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టిన మీ కుటుంబం ఎక్కడా? దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడా అని నిలదీశారు. ఇవాళ గాంధీ భవన్ లో (Gandhi Bhavan) మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. నిఖార్సైన తెలంగాణవాది జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉంటే సిగ్గులేకుండా ఎన్నికకే దూరం ఉన్నారంటే బీజేపీతో లోపాయికారి ఒప్పదం ఏ మేరకు ఉందో అర్థమవుతోందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత చెప్పారని ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

మోడీతో కాళ్ల బేరం కుదుర్చుకున్న కేటీఆర్ ఆయన దృష్టిలో పడేందుకే రాహుల్ గాంధీని విమర్శిస్తూ తపన ప్రజలకు అర్థం అవుతోందన్నారు. బీఆర్ఎస్ బీజేపీతో మానసికంగా విలీనం అయ్యారు కాబట్టే రాహుల్ పై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాల్సిన బాధ్యత మీది నాది కాదని ఇది స్పీకర్ కు, ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న వ్యవహారం అన్నారు. ఏ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇస్తారన్నారు. ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన మీ చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఓటు చోరీ అంశాన్ని రుజువులతో సహా రాహుల్ గాంధీ నిరూపిస్తుంటే వీటిని జీర్ణించుకోలేని మోడీ కేటీఆర్ తో ఇలాంటి మాట్లాడిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు వేరు కాదని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తేల్చేస్తామని కిషన్ రెడ్డి (Kishan Reddy) గతంలో అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించి రోజులు గడుస్తున్నా కిషన్ రెడ్డి ఎక్కడ పడుకున్నారని నిలదీశారు. కాళేశ్వరంపై సీబీఐ కేసులో ఎందుకు కదలిక లేదని ప్రశ్నించారు. సీబీఐ కేసు నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో మోడీ, అమిత్ షా, నడ్డా చుట్టూ తిరిగింది నిజమా కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ వారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా అని నిలదీశారు.

Next Story